వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం
ఉచిత విద్యుత్, యూడీఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా ఇస్తారు?
రూ.వందల కోట్ల కమీషన్ కోసం చంద్రబాబు, లోకేశ్ బరితెగింపు
తిరుపతి మంగళం: తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు, లోకేశ్ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రెడిసన్ బ్లూ (ఫైవ్ స్టార్), సీఆర్‌ఆర్ హాస్పిటాలిటీ (ఫైవ్ స్టార్), ఎసెన్షియల్ (త్రీ స్టార్) హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందన్నారు.
9 నెలల క్రితమే ఏర్పడిన సీఆర్‌ఆర్ హాస్పిటాలిటీకి తిరుచానూరు సమీపంలోని దామినేడులో 1.71 ఎకరాల ప్రైవేట్ స్థలంలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు,ఐదేళ్ల ఉచిత విద్యుత్, యూడీఎస్, జీఎస్టీ తదితర రాయితీలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఆ సంస్థకు హోటల్ రంగంలో అనుభవం, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు లేవని చెప్పారు. అనుమతుల వెనకున్న వ్యక్తులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే తిరుచానూరు సమీపంలో 21ఎకరాల టూరిజం భూమిని ఎకరాకు రూ.90 లక్షల చొప్పున 2 సంస్థలకు కేటాయించారని, ప్రభుత్వ విలువ ఎకరాకు రూ.4.5 కోట్లు ఉన్నప్పటికీ, తక్కువ ధరకే అప్పగించారన్నారు. రూ.వందల కోట్ల కమీషన్ల కోసం చంద్రబాబు, లోకేశ్ బరితెగించి, ఇష్టానుసారంగా అనుమతులివ్వడందారుణమన్నారు. స్టార్ హోటళ్ల పేరుతో భూ కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.


