హైదరాబాద్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో అనేక దుకాణాల మధ్య చిన్నగా కనిపిస్తున్న ఎకోరన్ ఎనర్జీ సంస్థ కార్యాలయం బోర్డు
కమలపాడు 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెంపు
ఏపీఈఆర్‌సీ అనుమతి లేకుండానే వ్యయం పెంపు.. పీఎస్పీపై దుమారం
గతంలో అంచనా రూ.7,376.74 కోట్లు..
తాజాగా రూ.8,161.69 కోట్లకు అనుమతి
రూ.64 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఈ సంస్థ ఎండీ ఇటీవల అరెస్ట్
ఇంతటి ఘోర చరిత్ర ఉన్న ఈ సంస్థ కోసం రూ.784.95 కోట్లు అదనం
ఇప్పటికే ఈ సంస్థకు రూ.5,470.62 కోట్ల పనులు..
మిగతా పనులూ ఇదే సంస్థకు కట్టబెట్టే యత్నం
మొత్తం ఆస్తులు రూ.వెయ్యి కోట్లుంటే.. ఏపీలో రూ.76,250 కోట్ల పెట్టుబడులు పెడుతుందట!
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామంలో నిర్మించనున్న 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ (పీఎస్పీ) ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భారీగా పెంచడం అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా రూ.784.95 కోట్ల అదనపు భారం పడుతున్నా, ఆ మేరకు ప్రైవేటు సంస్థకు మేలు చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపడం వెనుక అసలు కారణాలేవై ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. పీఎస్పీ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత రూ.7,376.74 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 12న జీవో నెం.3 పేరుతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కానీ ఎనిమిది నెలలకే ఆ వ్యయాన్ని రూ.8,161.69 కోట్లకు సవరిస్తూ ఈ నెల 19న మరో జీవో నెం.64 విడుదల చేసింది. ఈ పనులు చేపట్టనున్న హైదరాబాద్‌కు చెందిన ఎకోరన్ కన్సార్టియంకు రూ.5,470.62 కోట్ల విలువైన పనులు అప్పగించేందుకు కూడా ప్రభుత్వం అదే జీవోలో అనుమతినిచ్చింది. ఆ మొత్తంలో జీఎస్టీ కలపలేదని చెప్పింది. మిగతా పనులు కూడా ఇదే సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అంచనా వ్యయాన్ని సైతం పెంచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రూ.2,691.07 కోట్ల పనులు కూడా ఇదే సంస్థకు దక్కనున్నాయి. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. ఈ నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి లేదు. ఏపీఈఆర్‌సీ ఆమోదం పెండింగ్‌లో ఉందని స్వయంగా ప్రభుత్వ ఆదేశాల్లోనే పేర్కొనడం విశేషం.
‘టీఈసీ’ అక్కర్లేదు..రూ.785 కోట్లు అవసరం
కమలపాడు ప్రాజెక్టులో 238 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు, 118 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు చొప్పున మొత్తం 950 మెగావాట్లతో పీఎస్పీ ఏర్పాటు చేస్తామంటున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు సైతం ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నుంచి టెక్నో–ఎకనామిక్ కాంకరెన్స్ (టీఈసీ) పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రాజెక్టు వ్యయం ఒక్కసారిగా రూ.7,376.74 కోట్ల నుంచి రూ.8,161.69 కోట్లకు పెంచేసింది. జీఎస్టీ, ధరల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి(ఐడీసీ), ఎస్కలేషన్, ఇతర నిబంధనల కారణంగా రూ.785 కోట్లు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఎకోరన్‌పైనే ఎందుకింత ప్రేమ?
ఎకోరన్ కన్సార్టియంకు తొలి దశలో రూ.5,470.62 కోట్ల పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే ఆ సంస్థ ఎంతో గొప్ప సంస్థ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. దాని చరిత్ర చూస్తే విస్మయం కలుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎకోరన్ ఎనర్జీకి సంబంధించి జీఎస్టీ అధికారులు తప్పుడు ఇన్‌వాయిస్‌లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అక్రమ వినియోగం జరిగినట్లు గుర్తించారు. సుమారు రూ.64 కోట్ల ఐటీసీ అక్రమంగా పొందినట్లు ఆ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంస్థ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌ను అరెస్టు కూడా చేశారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అప్పగించడం వెనుక పెదబాబు, చినబాబుల స్వార్థ ప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.వెయ్యి కోట్ల సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
గతేడాది నవంబర్‌లో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా ఎకోరన్ సంస్థ రాష్ట్రంలో రూ.76,250 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 8 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 1.25 ఎంటీపీఏ గ్రీన్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే సంస్థ తెలంగాణలో మరో రూ.27,000 కోట్లతో 5.5 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రతిపాదిత పెట్టుబడులు రూ.1,03,250 కోట్లు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప్రాంతంతో ఓ వాణిజ్య భవనం, రెండవ అంతస్తులో అనేక దుకాణాల మధ్య ఒక చిన్న బోర్డు పెట్టుకుని ఏర్పాటైన ఎకోరన్ సంస్థ మొత్తం ఆస్తులు కేవలం రూ.1,000 కోట్లే. ఏడాదికి ఆ సంస్థ లాభాలు రూ.6 కోట్లు మాత్రమే. మరి అంత తక్కువ స్థాయిలో ఉన్న ఓ సంస్థ ఏపీలో ఏకంగా రూ.76,250 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.
ఇష్టానుసారం భూ దోపిడీ
రాష్ట్రంలో ఎకోరన్‌కు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారంలో భూముల కేటాయింపుల కోసం కేవలం 12 నెలల్లో ఏకంగా 13 జీవోలను విడుదల చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో కొన్ని జీవోలు ఏకంగా 508.66 ఎకరాల భూమిని వివిధ జిల్లాల్లో కేటాయిస్తూ ఇస్తే.. మరికొన్ని జీవోలు కేటాయించిన భూములను డొల్ల కంపెనీలకు మారుస్తూ ఇచ్చారు. తొలుత ఎకోరన్‌కు రాయితీలు కల్పిస్తూ జీవోలు ఇస్తే, వాటిని ఏఎంప్లస్ ఎవరెస్ట్, ఏఎంప్లస్ ఐఐఎఫ్‌ఏ సోలార్, దేశ్‌రాజ్ సోలార్ ఎనర్జీ, ఓ2 పవర్ ఎస్‌జీ పీటీఈ, అయిన రెన్యువబుల్ ఎనర్జీ, ఓ2 పవర్ ఎస్‌జీ2 పీటీఈ, ఆంపిన్ ఎనర్జీ, ఎన్‌ఎస్‌ఎల్ రెన్యువబుల్ ఎనర్జీ పేరు మీదకు బదలాయించారు. ఎకోరన్ పేరుతో కేటాయించిన భూములు ఇలా ఇతర కంపెనీలకు ఇవ్వడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా సింగపూర్ కేంద్రంగా నమోదైన ఓ2 పవర్ ఎస్‌జీ పీటీఈ, ఓ2 పవర్ ఎస్‌జీ2 పీటీఈ కంపెనీలకు భూములను బదలాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎకోరన్ సంస్థకు ఇంత ప్రాధాన్యం ఎందుకు? ప్రాజెక్టు వ్యయం పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సంస్థ పెట్టుబడుల సామర్థ్యంపై ప్రభుత్వం చేసిన పరిశీలన ఏమిటి? ఏపీఈఆర్సీ ఆమోదానికి ముందే పనులు అప్పగించడానికి తొందరెందుకు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.


