breaking news
Pumped project
-
‘ఎకోరన్’పై అలవిమాలిన ప్రేమ!
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామంలో నిర్మించనున్న 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ (పీఎస్పీ) ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భారీగా పెంచడం అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా రూ.784.95 కోట్ల అదనపు భారం పడుతున్నా, ఆ మేరకు ప్రైవేటు సంస్థకు మేలు చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపడం వెనుక అసలు కారణాలేవై ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. పీఎస్పీ ప్రాజెక్టు వ్యయాన్ని తొలుత రూ.7,376.74 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 12న జీవో నెం.3 పేరుతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కానీ ఎనిమిది నెలలకే ఆ వ్యయాన్ని రూ.8,161.69 కోట్లకు సవరిస్తూ ఈ నెల 19న మరో జీవో నెం.64 విడుదల చేసింది. ఈ పనులు చేపట్టనున్న హైదరాబాద్‌కు చెందిన ఎకోరన్ కన్సార్టియంకు రూ.5,470.62 కోట్ల విలువైన పనులు అప్పగించేందుకు కూడా ప్రభుత్వం అదే జీవోలో అనుమతినిచ్చింది. ఆ మొత్తంలో జీఎస్టీ కలపలేదని చెప్పింది. మిగతా పనులు కూడా ఇదే సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అంచనా వ్యయాన్ని సైతం పెంచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రూ.2,691.07 కోట్ల పనులు కూడా ఇదే సంస్థకు దక్కనున్నాయి. ఇందులో మరో విచిత్రం ఏమిటంటే.. ఈ నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి లేదు. ఏపీఈఆర్సీ ఆమోదం పెండింగ్‌లో ఉందని స్వయంగా ప్రభుత్వ ఆదేశాల్లోనే పేర్కొనడం విశేషం.‘టీఈసీ’ అక్కర్లేదు..రూ.785 కోట్లు అవసరంకమలపాడు ప్రాజెక్టులో 238 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు, 118 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు చొప్పున మొత్తం 950 మెగావాట్లతో పీఎస్పీ ఏర్పాటు చేస్తామంటున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు సైతం ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నుంచి టెక్నో–ఎకనామిక్ కాంకరెన్స్ (టీఈసీ) పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రాజెక్టు వ్యయం ఒక్కసారిగా రూ.7,376.74 కోట్ల నుంచి రూ.8,161.69 కోట్లకు పెంచేసింది. జీఎస్టీ, ధరల పెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి(ఐడీసీ), ఎస్కలేషన్, ఇతర నిబంధనల కారణంగా రూ.785 కోట్లు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది.ఎకోరన్పైనే ఎందుకింత ప్రేమ?ఎకోరన్ కన్సార్టియంకు తొలి దశలో రూ.5,470.62 కోట్ల పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే ఆ సంస్థ ఎంతో గొప్ప సంస్థ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. దాని చరిత్ర చూస్తే విస్మయం కలుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎకోరన్ ఎనర్జీకి సంబంధించి జీఎస్టీ అధికారులు తప్పుడు ఇన్వాయిస్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అక్రమ వినియోగం జరిగినట్లు గుర్తించారు. సుమారు రూ.64 కోట్ల ఐటీసీ అక్రమంగా పొందినట్లు ఆ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంస్థ ఎండీ యర్రంనేని లక్ష్మీప్రసాద్‌ను అరెస్టు కూడా చేశారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అప్పగించడం వెనుక పెదబాబు, చినబాబుల స్వార్థ ప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రూ.వెయ్యి కోట్ల సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులుగతేడాది నవంబర్‌లో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా ఎకోరన్ సంస్థ రాష్ట్రంలో రూ.76,250 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో 8 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 1.25 ఎంటీపీఏ గ్రీన్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదే సంస్థ తెలంగాణలో మరో రూ.27,000 కోట్లతో 5.5 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రతిపాదిత పెట్టుబడులు రూ.1,03,250 కోట్లు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప్రాంతంతో ఓ వాణిజ్య భవనం, రెండవ అంతస్తులో అనేక దుకాణాల మధ్య ఒక చిన్న బోర్డు పెట్టుకుని ఏర్పాటైన ఎకోరన్ సంస్థ మొత్తం ఆస్తులు కేవలం రూ.1,000 కోట్లే. ఏడాదికి ఆ సంస్థ లాభాలు రూ.6 కోట్లు మాత్రమే. మరి అంత తక్కువ స్థాయిలో ఉన్న ఓ సంస్థ ఏపీలో ఏకంగా రూ.76,250 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.ఇష్టానుసారం భూ దోపిడీరాష్ట్రంలో ఎకోరన్‌కు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారంలో భూముల కేటాయింపుల కోసం కేవలం 12 నెలల్లో ఏకంగా 13 జీవోలను విడుదల చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇందులో కొన్ని జీవోలు ఏకంగా 508.66 ఎకరాల భూమిని వివిధ జిల్లాల్లో కేటాయిస్తూ ఇస్తే.. మరికొన్ని జీవోలు కేటాయించిన భూములను డొల్ల కంపెనీలకు మారుస్తూ ఇచ్చారు. తొలుత ఎకోరన్‌కు రాయితీలు కల్పిస్తూ జీవోలు ఇస్తే, వాటిని ఏఎంప్లస్ ఎవరెస్ట్, ఏఎంప్లస్ ఐఐఎఫ్ఏ సోలార్, దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ, ఓ2 పవర్ ఎస్జీ పీటీఈ, అయిన రెన్యువబుల్ ఎనర్జీ, ఓ2 పవర్ ఎస్జీ2 పీటీఈ, ఆంపిన్ ఎనర్జీ, ఎన్ఎస్ఎల్ రెన్యువబుల్ ఎనర్జీ పేరు మీదకు బదలాయించారు. ఎకోరన్ పేరుతో కేటాయించిన భూములు ఇలా ఇతర కంపెనీలకు ఇవ్వడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా సింగపూర్ కేంద్రంగా నమోదైన ఓ2 పవర్ ఎస్జీ పీటీఈ, ఓ2 పవర్ ఎస్జీ2 పీటీఈ కంపెనీలకు భూములను బదలాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎకోరన్ సంస్థకు ఇంత ప్రాధాన్యం ఎందుకు? ప్రాజెక్టు వ్యయం పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సంస్థ పెట్టుబడుల సామర్థ్యంపై ప్రభుత్వం చేసిన పరిశీలన ఏమిటి? ఏపీఈఆర్సీ ఆమోదానికి ముందే పనులు అప్పగించడానికి తొందరెందుకు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. -
సీలేరులో మరో వెలుగు
సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక్కొక్క నీటి బిందువు ప్రవాహంలా మారి ప్రవహిస్తూ పేరు గాంచిన సీలేరు నది రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది.ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ప్రవహించే నీటితో తక్కువ ఖర్చుతో రూ.కోట్లలో ఆదాయం ఇచ్చేలా మరో జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం కానుంది. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో ఉన్న జలవిద్యుత్ కేంద్రాలతో పాటు నూతనంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకం) నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరో నెలరోజుల్లో పనులూ ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు.ప్రాజెక్టు నిర్మాణం ఇలాతూర్పుకనుమల్లో మాచ్‌ఖండ్ మొదలుకొని బలిమెల నుంచి సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాల్లోఉత్పత్తి అయిన నీరు శబరి నదిలో కలిసి గోదావరి మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిని వృధా కాకుండా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ద్వారా మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో ఏపీ జెన్కో రూ.13 వేల కోట్లతో సీలేరు సమీప పార్వతీనగర్ వద్ద తొమ్మిది యూనిట్లు ( 1350 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పైభాగంలో 3 కిలోమీటర్ల పొడవునా. సొరంగం తవ్వి గుంటవాడ డ్యామ్ నుంచి నీటిని తీసుకువచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.అనంతరం విడుదలైన నీరు మరో 3 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా డొంకరాయి జళాశయంలోకి మళ్లిస్తారు. అవసరమైనప్పుడు ఆదే నీటిని రివర్స్ పంపింగ్ విధానంతో ఆదే సొరంగం ద్వారా గుంటవాడ డ్యాంలోకి మళ్లించి మూడు సొరంగాల ద్వారా తొమ్మిది పైపులైన్లతో ఏర్పాటు చేయనున్నారు. అవసరమైనప్పుడు ఈ నీటిని విద్యుత్ ఉత్పత్తి చేసే వి«ధంగా యాప్‌కో సంస్థ ద్వారా మూడేళ్లు సుదీర్ఘంగా పరిశీలన చేసింది. -
మునిగిన నెట్టెంపాడు మోటార్లు
సెన్సార్లు పనిచేయకపోవడంతో సమస్య సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టు డీ వాటరింగ్ పంపు మోటార్లు నీట మునిగాయి. ప్రాజెక్టులో సీపేజీ నీటితో నిండే తొట్టిల నుంచి డీవాటరింగ్ చేయాల్సిన సమయంలో సెన్సార్లు పనిచేయకపోవడంతో మోటార్లు నడవక ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా మొదటి రిజర్వాయర్‌గా ఉన్న గూడెందొడ్డిలో భూగర్భంలోని పంపింగ్ స్టేషన్లో 4 మోటార్ల ద్వారా నీటి తరలింపు జరుగుతుంది. ఈ మోటార్లు నడిచేందుకు ఇబ్బంది లేకుండా, పంపింగ్ స్టేషన్లోఉండే సీపేజీని సెన్సార్‌తో నడిచే చిన్నస్థాయి మోటార్లతో తోడతారు. సీపేజీ నీరు తగిన లెవల్‌కు రాగానే సెన్సార్లు పనిచేసి మోటార్లు ఆన్ అవుతాయి. ఆదివారం సీపేజీ నీరు తగిన లెవల్‌కి వచ్చినా సెన్సార్లు పనిచేయకపోవడంతో మోటార్లు ఆన్ కాలేదు. దీంతో నీటి లెవల్ పెరుగుతూ వచ్చి వాటరింగ్ పంపులు నీటమునిగాయి. అయితే నీటిని తరలించే ప్రధాన పంపుల లెవల్ 295.98 మీటర్లు కాగా, 291 మీటర్ల లెవల్ వరకు నీరు చేరింది. దీంతో ప్రధాన మోటార్లపై ముంపు ప్రభావం పడలేదు. వెంటనే సమస్యను గుర్తించిన అధికారులు పంప్‌హౌస్‌లోని సర్జ్‌పూల్ ఇంటేక్వెల్ గేట్లు మూసేసి నీటిని నియంత్రించారు. నీటిని తోడే ప్రక్రియను సోమవారం మొదలు పెట్టారు. పరిస్థితిని పరిశీలించడానికి నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు.. అధికారులను సంఘటనా స్థలానికి పంపారు.


