మునిగిన నెట్టెంపాడు మోటార్లు | The Nettempadu project de watering pump motors were immersed. | Sakshi
Sakshi News home page

మునిగిన నెట్టెంపాడు మోటార్లు

Aug 29 2017 2:50 AM | Updated on Sep 12 2017 1:12 AM

పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టు డీ వాటరింగ్‌ పంపు మోటార్లు నీట మునిగాయి.

సెన్సార్‌లు పనిచేయకపోవడంతో సమస్య
సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టు డీ వాటరింగ్‌ పంపు మోటార్లు నీట మునిగాయి. ప్రాజెక్టులో సీపేజీ నీటితో నిండే తొట్టిల నుంచి డీవాటరింగ్‌ చేయాల్సిన సమయంలో సెన్సార్‌లు పనిచేయకపోవడంతో మోటార్లు నడవక ఈ సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా మొదటి రిజర్వాయర్‌గా ఉన్న గూడెందొడ్డిలో భూగర్భంలోని పంపింగ్‌ స్టేషన్‌లో 4 మోటార్ల ద్వారా నీటి తరలింపు జరుగుతుంది. ఈ మోటార్లు నడిచేందుకు ఇబ్బంది లేకుండా, పంపింగ్‌ స్టేషన్‌లోఉండే సీపేజీని సెన్సార్‌తో నడిచే చిన్నస్థాయి మోటార్లతో తోడతారు.

సీపేజీ నీరు తగిన లెవల్‌కు రాగానే సెన్సార్‌లు పనిచేసి మోటార్లు ఆన్‌ అవుతాయి. ఆదివారం సీపేజీ నీరు తగిన లెవల్‌కి వచ్చినా సెన్సార్‌లు పనిచేయకపోవడంతో మోటార్లు ఆన్‌ కాలేదు. దీంతో నీటి లెవల్‌ పెరుగుతూ వచ్చి వాటరింగ్‌ పంపులు నీటమునిగాయి. అయితే నీటిని తరలించే ప్రధాన పంపుల లెవల్‌ 295.98 మీటర్లు కాగా, 291 మీటర్ల లెవల్‌ వరకు నీరు చేరింది. దీంతో ప్రధాన మోటార్లపై ముంపు ప్రభావం పడలేదు. వెంటనే సమస్యను గుర్తించిన అధికారులు పంప్‌హౌస్‌లోని సర్జ్‌పూల్‌ ఇంటేక్‌వెల్‌ గేట్లు మూసేసి నీటిని నియంత్రించారు. నీటిని తోడే ప్రక్రియను సోమవారం మొదలు పెట్టారు. పరిస్థితిని పరిశీలించడానికి నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు.. అధికారులను సంఘటనా స్థలానికి పంపారు.

Advertisement

పోల్

Advertisement