తణుకు(ప.గో. జిల్లా): ఏపీలో నియంత పాలన కొనసాగుతోందనడానికి తమ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని కూల్చేయడం మరొక ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. కక్షతోనే ఆమె ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 22వ తేదీ) తణుకు నియోజకవర్గం అయింతపూడిలో కూటమి నేతలు కూల్చేసిన మాజీ సర్పంచ్ లావణ్య ఇంటిని పరిశీలించడానికి వైఎస్సార్‌సీపీ నేతలు వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి తదితరులు వెళ్లారు. దీనిలో భాగంగా వారు మీడియాతో మాట్లాడారు.
‘మాజీ సర్పంచ్ లావణ్యను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ టార్గెట్ చేశారు. కక్షతో ఆమె ఇంటిని కూల్చేశారు. తణుకులో ఎలాంటి భయానక వాతావరణం ఉందో అర్థమవుతుంది. హిట్లర్, గడాఫీ కన్నా దారుణంగా టిడిపి నాయకుల పాలన ఉంది. టీడీపీ కండువా వేసుకోలేదని వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారని వీరిపై కక్ష గట్టారు. ఇది కూటమి ప్రభుత్వమా కూల్చివేతల ప్రభుత్వమా...?, మహిళ అని కూడా చూడకుండా లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారు..ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు బుల్డోజర్ సర్కార్. అసలు మనం ఏపీలో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా’ అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అయితంపూడి మాజీ సర్పంచ్ లావణ్య కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మహిళపై ఎందుకింత కక్ష. ఇల్లు కూల్చడమే కాకుండా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడతారా....?, ఫ్లెక్సీల కోసం ఏకంగా సీసీ కెమెరాలు నిఘా పెట్టారు. తణుకులో వైఎస్సార్‌సీపీకి మద్దతు పెరుగుతుందని ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి ఇల్లు కూల్చేశారు. ఇళ్లలో ఎవరు ఉన్నారు.. ఏంటి అనేది ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదా?, వైఎస్సార్‌సీపీ వారి ఇళ్లను కూల్చి వేయించడం దారుణం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి:


