వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియవ‌నుకున్నారా? | KSR Comments on Chandrababu Palle Panduga Speech | Sakshi
Sakshi News home page

సూపర్ సిక్స్ హామీల అమ‌లు మాటేమిటి?

Oct 6 2026 4:10 PM | Updated on Oct 6 2026 4:42 PM

KSR Comments on Chandrababu Palle Panduga Speech

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహజంగానే అధికంగా అసత్యాలు చెబుతారన్న నానుడి ఉంది. వాటితో పాటు కొన్ని చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో పలచన అవుతున్నారన్న భావనకు అవకాశం ఇస్తున్నారు. పల్లె పండగ పేరుతో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఒక సభ జరిగింది. అది నిజంగా పల్లె పండగ అవుతుందా, లేదా? అన్నది పక్కనబెడితే ఎవరు ఏ కాస్త  అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినా మంచిదే. కాకపోతే గతంలో ఏమీ జరగనట్లు, ఇప్పుడే అన్ని జరుగుతున్నట్లు కలరింగ్ ఇస్తే సరిపోతుందా? మొత్తం వాగ్దానాలన్నీ నెరవేర్చేసినట్లు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేసినట్లు స్పీచ్‌లు ఇస్తే వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియకుండా పోతుందా? ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉపాధి అంతంత మాత్రంగానే ఉండడం తదితర అనేక సమస్యలతో గ్రామీణాంధ్ర కొట్టుమిట్టాడుతోంది.

ముందుగా ఆయన  చేసిన చిత్రమైన వ్యాఖ్యలు చూద్దాం. ఏపిలో ఎల్‌నినో ప్రభావం ఉందని చెబుతూనే తాము ప్రార్దన చేయడం వల్లే వరుణ దేవుడు కరుణించి విశాఖలో 27 సెంటిమీటర్ల వర్షం కురిపించాడట. వర్షాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటే వచ్చే చిక్కేమిటన్నది ఆయనకు అవసరం లేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అది మాట్లాడేసి జనాన్ని నమ్మించే యత్నం చేయడం ఆయనకు అలవాటే. బంగళాఖాతంలో వాయుగుండం వల్ల ఇటీవల ఉత్తరాంధ్రలో వర్షాలు పడ్డాయి. దానివల్ల  రైతులకు కొంత మేలు, మరికొంత  నష్టం జరిగింది. దానిని పక్కనబెడితే కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు విశాఖలో తాగు నీటి సమస్య ఉందని, ఈ ఏడాది తాము ఏమీ చేయలేమని, వచ్చే ఏడాదికి తీర్చుతామని చెప్పారు. దాంతో విశాఖ ప్రజలు తమ ఖర్మ ఇంతేనా అని సరిపెట్టుకున్నారు. అప్పుడే ఆ మాట చెప్పకుండా తాను ప్రార్దన చేయబోతున్నానని, వర్షాలు పడబోతున్నాయని చెప్పి ఉంటే.. వర్షాలు పడిన వెంటనే టీడీపీ మీడియా ఇక చంద్రబాబుకు దైవశక్తులు ఉన్నాయని ఊదరగొట్టేసి ఉండేదేమో! కాని అప్పటికి కరువు గురించే మాట్లాడారు.

కరువుకు క్రెడిట్ తీసుకోరా?
చంద్రబాబు ఒక్క విశాఖ గురించే ప్రార్దన చేశారా? లేక రాష్ట్రం అంతటా వర్షాలు పడాలని ప్రార్దించారా అన్నది పలువురి ప్రశ్న. చంద్రబాబు చెప్పేది నిజమే అయితే రాయలసీమలో వర్షాలు పడాలని ఎందుకు ప్రార్దనలు చేయలేదని వారు అడుగుతున్నారు. పలు చోట్ల చీని తోటలు ఎండిపోయాయి. వర్షాలు లేక పంటలే వేయలేకపోయారు. నెలల తరబడి కృష్ణా డెల్టాలో సరిపడా వర్షాలు లేక శివారు భూములకు నీరు సరిగా అందలేదు. ఆ సమయంలో చంద్రబాబు ఈ ప్రార్ధనలేవో చేసి వర్షాలు తెప్పించి ఉండాలి కదా! అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలా వర్షాలకు క్రెడిట్ తీసుకుంటే కరువుకు కూడా బాధ్యత వహించాలి అన్న సంగతి తెలియదా! ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పాలనలో ఆయా సంవత్సరాలలో వచ్చిన  కరువులను ప్రస్తావించి ఆ స‌మస్యను ప్రత్యర్దులు ఆయన ఖాతాలో వేస్తుంటారు.

చంద్రబాబు ఈ స్పీచ్ ఇచ్చిన రోజే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపి, తెలంగాణలలోని కొన్ని ప్రాంతాలు కరువు పీడితంగా ఉన్నాయని ఢిల్లీలో తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఏదో తాత్కాలిక రాజకీయం కోసం జనాన్ని సెంటిమెంట్ రాజకీయాలతో మభ్య పెట్టే బదులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడితే బాగుంటుంది. అందులోను ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలతో ప్రజలలో పలచన అవవడం మంచిదా! ఎల్లో మీడియా కూడా ఈ వ్యాఖ్యలను ప్రచురిస్తే చంద్రబాబుకు నష్టం వస్తుందని అనుకున్నదేమో కాని, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది.

ఇలాంటి మాటలు చెబితే ఎలా! 
ఇక 22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. గతంలో డావోస్ వెళ్లిన సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడితే అది జాతీయ మీడియాలో సైతం వైరల్ అయింది. ప్రసంగంలో పొరపాటు దొర్లితే సరిచేసుకోవచ్చు. కాని ఒకటికి రెండుసార్లు అవే తప్పులు చెబితే ప్రజలకు భిన్నమైన సంకేతం వెళుతుంది. పైగా 22 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ పచ్చి అబద్దాలను చెబితే జనం చెవిలో పూలు పెట్టడం కాదా! నిరుద్యోగ భృతి ఎగవేయడం కోసం ఇలాంటి మాటలు చెబితే ఎలా! పది లక్షల కోట్ల అప్పు తాము అధికారంలోకి వచ్చేనాటికి ఉందని మరో అబద్దం చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకున్నా, అందులో ఆయన ఏడేళ్ల పాలనలో ఎంత అప్పు చేసింది, జగన్ ఐదేళ్లలో ఎంత అప్పు అయింది వివరించకుండా, మొత్తం జగన్ ఖాతాలో వేయడంలోని దురుద్దేశాన్ని సామాన్యులు పసికట్టకపోవచ్చేమో కాని, బుద్ది జీవులు కనిపెట్టలేరా!

ఆ పని ఎప్పటికి చేయలేరు
కూటమి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిందట. టీడీపీ, జనసేన ఉమ్మడి మానిఫెస్టో కాపీని దగ్గరపెట్టుకుని వరసగా ఇచ్చిన హామీలు చదువుతూ ఈ మాట చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఉంటే ఒప్పుకోవచ్చు. కాని ఆ పని ఎప్పటికి వారు చేయలేరు. ఎందుకంటే ప్రజలను తాము మోసం చేస్తున్నామని వారికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా తన వంతు అసత్యాలు చెప్పారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్‌సీపీ హయాంలో 880 కి.మీ.రోడ్లే వేశారని ఆయన అంటున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వం 7600 కిలోమీటర్ల రోడ్డు వేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు జవాబు ఇస్తున్నారు.

పవన్ ముద్ర కనబడుతోందట‌!
అలాగే గ్రామాలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ వంటి సంస్కరణలు తెచ్చి గ్రామాలకు అభివృద్ది రూపం ఇచ్చిన ఘనత  జగన్ ది కాదనగలరా? బీజేపీ అధ్య‌క్షుడు మాధవ్ తన ఉపన్యాసంలో గ్రామ సచివాలయాల ప్రస్తావన తెచ్చారు. అవి ఎవరి టైమ్‌లో వచ్చింది తెలియదా!. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు భలే పొగుడుకున్నారు. చంద్రబాబు తన స్పీచ్‌లో పల్లె వికాసంలో పవన్ కళ్యాణ్ ముద్ర కనబడుతోందని చెబుతున్నారు. పవన్ ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ది చేస్తున్నారట. లక్షకు పైగా పంట కుంటలు, పశువుల షెడ్లు, నీటి తొట్టెలు నిర్మించారట. పల్లెకు ఆయన హుషారుతో పట్టాభిషేకం చేస్తున్నారట.

ఇదీ చ‌ద‌వండి: బాబు 'బీసీ' బిల్డ‌ప్‌.. కోర్టు తీర్పుతో అట్ట‌ర్‌ఫ్లాప్‌!  

ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబులో అద్బుతమైన ఆర్ధిక ప్రణాళిక ఉందని అంటున్నారు. సీఎంతో సహకారం అందిస్తున్నారని ఆయన అన్నారు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం అని చెప్పాలి. బాగా పనిచేస్తే దండ వేస్తామని, లేకుంటే దండిస్తామని చెప్పడం ద్వారా వారికి వార్నింగ్ ఇచ్చారన్నమాట. మరి కూటమి ఎన్నికల హామీల మాటేమిటని మాత్రం ఎవరూ అడగకూడదన్నమాట. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండగను కాంట్రాక్టర్ల‌ పండుగగా అభివర్ణించారు. పాలకుల విధానాలే పల్లెలకు శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా పట్టాభిషేకం వంటి సినిమా డైలాగులు కాకుండా నిజంగా గ్రామాలకు మేలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు.

- కొమ్మినేని శ్రీనివాస‌రావు
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, రాజ‌కీయ వ్యవ‌హారాల వ్యాఖ్యాత‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement