బాబు ‘బీసీ’ బిల్డప్‌.. కోర్టు తీర్పుతో అట్టర్‌ ఫ్లాప్‌! | KSR's Comments On Chandrababu AP BC Quota Court Verdict | Sakshi
Sakshi News home page

బాబు ‘బీసీ’ బిల్డప్‌.. కోర్టు తీర్పుతో అట్టర్‌ ఫ్లాప్‌!

Oct 2 2026 10:18 AM | Updated on Oct 2 2026 10:56 AM

KSR's Comments On Chandrababu AP BC Quota Court Verdict

అది మోసమని తెలుసు.. ప్రజలను మభ్య పెట్టడమని తెలుసు.. అయినా ఎందుకు కావాలని ప్రభుత్వంలోని వారు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తుంటారు? అదే రాజకీయం అన్నమాట. ఇలాంటి విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం డాక్టరేట్ సాధించిందని ఒప్పుకోవచ్చు.

దేశంలో రిజర్వేషన్‌లకు సంబంధించి సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు అందరికి తెలుసు. దాని ప్రకారం ఏభై శాతం మించితే అవి చెల్లవు. అయినా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చెల్లని జీఓ ఒకటి ఇచ్చేసింది. ఆ తర్వాత టీడీపీ క్యాడర్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం వంటివి చేసేశారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు 34 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నామని గొప్పలు పోయారు. జయహో బీసీ అంటూ ఊదరగొట్టారు. కాస్త బుద్ది జీవులు కాని, బీసీ సంఘాలవారు కాని ఇదేమి మోసం అని విస్తుపోయారు.

ఏభై ఏళ్ల రాజకీయ సీనియర్‌ని అని చెప్పుకునే చంద్రబాబు మరీ ఇంత ఓపెన్‌గా ప్రజలను తప్పుదారి పట్టించవచ్చా అని వారు బాధపడ్డారు. కాని చంద్రబాబు స్టైలే అది కదా అని అనుకున్నారు. ఈ జీఓలపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ రిజర్వేషన్ల జీఓలు చెల్లవని హైకోర్టు కొట్టివేసింది. ఏభై శాతం మించిన రిజర్వేషన్‌లను ఎలా సమర్ధించుకుంటారని హైకోర్టు ప్రశ్నిస్తే సరైన సమాధానం ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. రాజివ్ రంజన్ కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారని, అలాంటప్పుడు  ఆ నివేదిక ఆధారంగా బీసీలకు 34 శాతం రిజర్వేష్లు ఎలా ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. 

పంచాయతీరాజ్ చట్టంలోనే వెసులుబాటు ఉందంటూ కొత్త వాదన తెచ్చి బీసీ వర్గాలను మాయచేయాలని కూడా అనుకున్నారు. ఎల్లో మీడియాలో బీసీలకు రిజర్వేషన్లు పెంచేసినట్లుగా హోరెత్తించారు. ఇవన్ని ఉట్టిదేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం బీసీలను మాయ చేయడానికి డ్రామా ఆడిందన్న విషయం బట్టబయలైంది.

నిజానికి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వాలన్న నిజాయితీ ఉంటే, పార్లమెంటులో సంబంధిత చట్టం తీసుకురావడానికి కృషి చేసి ఉండాల్సింది. కేంద్రంలో టీడీపీ ఎంపీల బలంతోనే ఎన్‌డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న వస్తుంది. ఇది బీసీలను వంచించడం కాదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు కల్పించడానికి గత జగన్ ప్రభుత్వం కూడా జీఓ ద్వారా యత్నించింది. దానిపై బిర్రు ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడు హైకోర్టుకు వెళ్లారు. దాంతో జీఓలను అప్పట్లో న్యాయ స్థానం కొట్టేసింది. ఆ మీదట ఏభై శాతం మించకుండా చట్టప్రకారం సుమారు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, పార్టీ పరంగా సుమారు ఏభై శాతం వరకు బీసీలకు టిక్కెట్లు ఇచ్చి జగన్ న్యాయం చేశారు.

ఉదాహరణకు 69 శాతం మేయర్ పదవులను బీసీలకు ఇచ్చారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఆ రకంగా  కొన్ని జనరల్ స్థానాలలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లకు గాను ఆరింటిని బీసీలకు వచ్చేలా చేశారు. 46 శాతం పదవులను బీసీవర్గాలకు కట్టబెట్టారన్నమాట. మండల పరిషత్, మున్సిపల్ చైర్ పర్సన్‌ల పదవులకు కూడా ఇలాగే ఏభై శాతం పైగా జగన్ బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు ఆ ప్రకారం ఇస్తామని చెప్పలేకపోతున్నారు.

ఇదీ చదవండి: రేవంత్‌ మాటలు.. బీజేపీకి వరంగా మారుతున్నాయా?

గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి గెలుపుకోసం ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రచారం ఆరంభించారు. మున్సిపాల్టీలలో 11 వేల కోట్ల రూపాయల పనులు, పల్లెలలో 11 వేల కోట్ల రూపాయల పనులు చేపడుతున్నట్లు హంగామా చేసి సభలు పెట్టారు. పల్లెకు పట్టాభషేకం, పేదలకు పట్టాభిషేకం అంటూ డైలాగులు చెబుతూ హోరెత్తించారు. స్థానిక ఎన్నికలలో కూటమికి తిరుగులేదని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. బీసీలకు తాము న్యాయం చేయబోయామని కాని వైఎస్సార్‌సీపీ అడ్డుకుందని కూడా టీడీపీ ప్రచార వ్యూహం అమలు చేయవచ్చు. ఎందుకంటే అలవోకగా అబద్దాలు ఆడడంలో ఈ పార్టీ మంచి నైపుణ్యం సాధించిందన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అసలు సమస్య కూటమికి ఎదురు అవుతుంది. ఆరు వారాలలో ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. అది సాధ్యం కాదని చెప్పి వాయిదా కోరితే తప్ప ఎన్నికలు ఆగకపోవచ్చు. అయితే టీడీపీ, జనసేనల మధ్య పోటీచేసే స్థానాలపై పంచాయతీ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని నాదెండ్ల మనోహర్ కాని ఒకసారి ఆత్మాభిమానం అంటూ, మరోసారి గెలుపు ప్రాతిపదిక అంటూ టీడీపీ లైన్‌లో మాట్లాడారు. తద్వారా కార్యకర్తలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కనీసం 30 శాతం సీట్లు అయినా జనసేనకు ఆయా పదవులకు పోటీచేసే అవకాశం కల్పించాలన్నది క్యాడర్ డిమాండ్. కాని పవన్ కళ్యాణ్ ఎంతవరకు న్యాయం చేస్తారో అన్న సంశయం వారికి లేకపోలేదు. అయినా ఏదో ఆశ వారిలో ఉంది.

టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు నారా లోకేష్ ఇప్పటికే 15 శాతం సీట్లు జనసేనకు ఇస్తామని ప్రకటించారు. దానిని నేరుగా ఖండించే ధైర్యం జనసేనకు లేకపోయింది. కాకపోతే కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో వారి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి సరిపెట్టుకున్నారు. 30 శాతం సీట్లు సాధించగలిగితే పవన్ కళ్యాణ్‌పై పార్టీలో నమ్మకం పెరుగుతుంది. లేదంటే పార్టీలో నిరాశ అలముకుంటుంది. అది వేరే సంగతి. ఒకవేళ 30 శాతం సీట్లు జనసేనకు, మరో ఐదు శాతం సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే టీడీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బలం లేని జనసేన, బీజేపీలకు అన్ని సీట్లు ఇవ్వడం ఏమిటని టీడీపీ స్థానిక నేతలు తిరుగబడే అవకాశం ఉంటుంది. 30 శాతం కాకపోయినా, 15 శాతంతోనే జనసేనకు సరిపెట్టినా, సీట్ల కేటాయింపులో గడబిడలు కొంతమేర జరగవచ్చు.

ఉదాహరణకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల మేయర్ పదవులను జనసేన కోరుతోందట. కాని వాటిని టీడీపీ తమకు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఈ పరిస్థితిలో సామాజికవర్గాల సమస్య కూడా టీడీపీ ఎదుర్కోవలసి ఉంటుంది. జగన్ మాదిరి బీసీ వర్గాలకు పార్టీపరంగా ఏభై శాతం సీట్లు ధైర్యంగా ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. ఈ సమస్యతో పాటు బీసీలకు, బలహీనవర్గాలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానం కూడా కూటమికి తలనొప్పిగా మారుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపైన, యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. వైఎస్సార్‌సీపీ వారిని భయపెట్టి పోటీలో లేకుండా చేయడానికి కూడా యత్నించవచ్చు.

అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ క్యాడర్‌కు, నేతలకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని చోట్ల పోటీచేయాల్సిందేనని చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వపరంగా జనాన్ని పోగుచేస్తే తప్ప చంద్రబాబు మీటింగ్‌లు జరగడం కష్టంగా ఉంటే, జగన్ ఎక్కడకు వెళ్లినా వస్తున్న జన తరంగాలు కూటమిని కలవరపెడుతున్నాయి. వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికలలో మాదిరి ఏదైనా మాయ జరిగితే తప్ప స్థానిక ఎన్నికలు కూటమికి ఒక అగ్ని పరీక్షవంటివే అని చెప్పాలి.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement