అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వివిధ వాట్సాప్ గ్రూపుల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో గత కొన్నేళ్లుగా రోజూ పెడుతున్న దిన పంచాంగం, ఆరోజు జరిగే కార్యక్రమాల వివరాలు గత ఐదు రోజులుగా పెట్టకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరగా గత శనివారం ఈ పంచాంగం పెట్టారు.
ఆ తరువాత పెట్టలేదు. రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలూ ఆయా దేవస్థానాల పండితులు గణించిన పంచాంగాన్ని ఆయా దేవస్థానాల వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. అన్నవరం దేవస్థానంలో మాత్రం గుర్తుకు వచ్చినపుడు మాత్రమే పంచాంగం పెడుతున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. ఇది పంచాంగం మాత్రమే కాకుండా దేవస్థానానికి ఒక విధంగా ప్రచారం కూడా. ప్రతిరోజూ పంచాంగం పెట్టేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


