కాణిపాకం/చిత్తూరు కార్పొరేషన్: జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలన అంతా ఇక్కడి నుంచే సాగేది. పునర్విభజన తర్వాత చిత్తూరు జెడ్పీ కాస్తా తిరుపతి, అన్నమయ్య జిల్లా పరిషత్‌లుగా మూడు ముక్కలైంది. ప్రస్తుతం 27 మండలాలతో చిత్తూరు జెడ్పీ కొలువుదీరింది. జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అంతటా నెలకొంది. గుడిపాల, పూతలపట్టు, బంగారుపాళ్యం, పాలసముద్రం జెడ్పీటీసీలు రేసులో ఉన్నారు. ఈ నెల 20న జెడ్పీటీసీలు పరోక్ష పద్ధతిలో జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రథమ పౌరురాలిని ఎన్నుకోనున్న వేళ.. అసలు ఆ పోస్టు ఎందుకు అంత కీలకం, వారి హక్కులు, విధులు, ప్రోటోకాల్‌పై ప్రత్యేక కథనం.
రూ.200 కోట్ల బడ్జెట్.. అన్ని శాఖలపై పర్యవేక్షణ
జిల్లా అభివృద్ధిలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌దే కీలక పాత్ర. ఏటా సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉండే జెడ్పీ బడ్జెట్‌ను వీరే ఆమోదిస్తారు. జెడ్పీ ఆర్థిక సంఘం, సాధారణ నిధుల నుంచి మండలాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తారు. ఎంపీపీలు రూపొందించిన ప్రణాళికలను సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. జెడ్పీ అనుబంధ విభాగాలైన విద్య, వైద్యం, డీఆర్‌డీఏ, డ్వామా, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ఇంజినీరింగ్ శాఖల బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు ఆయా శాఖల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధులను మినహాయించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసే అధికారం వీరికి ఉంటుంది.
విధులు ఇవీ..
ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఉంటారు. వీరిని ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు. జెడ్పీ చైర్మన్, వైస్–చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసే ప్రధాన హక్కు వీరికే ఉంటుంది. అవసరమైతే చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలోనూ జెడ్పీటీసీలే కీలక పాత్ర పోషిస్తారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో తమ మండలాల సమస్యలపై అధికారులను ప్రశ్నించడం, తీర్మానాలను ప్రతిపాదించడం తదితర హక్కులు వీరికి ఉంటాయి. తమ మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ప్రత్యేక ఆహా్వనితులుగా హాజరై తగిన సలహాలు ఇస్తారు. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల్లో సభ్యులుగా ఉండి కీలక నిర్ణయాల్లో భాగస్వాములవుతారు. తమ మండలంలోని గ్రామాల అవసరాలను గుర్తించి, జిల్లా పరిషత్ నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. మండలంలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి పనుల నాణ్యతను, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల పనితీరును పరిశీలించి జెడ్పీ సమావేశాల దృష్టికి తీసుకెళ్తారు. వీరికి నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఇస్తారు. జెడ్పీ సమావేశాలకు హాజరైనప్పుడు టీఏ, డీఏలు అదనంగా లభిస్తాయి.
కలెక్టర్, ఎస్పీ కంటే పైస్థాయి ప్రోటోకాల్
పంచాయతీరాజ్ వ్యవస్థలో జెడ్పీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులు అత్యంత కీలకమైనవి. జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉండే జెడ్పీ చైర్‌పర్సన్‌కు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ మంత్రి స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కంటే పైస్థాయిలో, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమానంగా వీరికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, ప్రభుత్వ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి తర్వాత ప్రధాన స్థానాన్ని పొందుతారు. వీరికి నెలకు రూ.40 వేల గౌరవ వేతనంతో పాటు అధికారిక కారు, అలవెన్సులు, సీసీ, పీఏ, డ్రైవర్, 1+1 గన్‌మెన్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. జెడ్పీ చైర్మన్ కార్యాలయంతో పాటు ప్రత్యేక క్యాంప్ కార్యాలయం ఉంటుంది. క్యాంప్ కార్యాలయంలో ఎంపీడీవో క్యాడర్ అధికారితో పాటు జూనియర్, సీనియర్ సహాయకులను నియమించుకునే వెసులుబాటు కల్పించారు.
ఇదీ చదవండి: మండీ బిర్యాని తిన్న 9 మందికి అస్వస్థత


