తాడేపల్లి: బీసీలకు ద్రోహం చేయాలనుకున్న ప్రతీసారి ముందు వరసలో బీసీలనే పెట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత చెల్లుచోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు బీసీలను వంచించడానికి ఢిల్లీలో మరో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదేనన్నారు.
‘రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడానికి వైఎస్సార్‌సీపీ కారణమని గతంలో వెన్నుపోటు పార్టీ చేసిన ప్రచారం పచ్చి అబద్ధం.. న్యాయస్థానం తీర్పు ఆధారంగానే ఆ మేరకు ఎన్నికలు జరిగాయి. వైఎస్ జగన్‌పై నిందలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని బీసీ వర్గాలు ఇప్పటికే అర్థం చేసుకున్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేవలం జీవో ఇస్తే సరిపోదు. కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి, దాన్ని కేంద్రం ఆమోదించాలి, అవసరమైతే షెడ్యూల్ 9లో చేర్చాలి.
రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించారా? ఆ నివేదిక ఆధారంగా చట్టం చేశారా? చేయకుండానే 34 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తామని చెబుతున్నారు?, చంద్రబాబు ప్రభుత్వం నిజంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తమ అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్‌లో చట్టం చేయించాలి. బీసీల కోసం ఢిల్లీ వెళ్లారా? చంద్రబాబు కోసం వెళ్లారా? బీసీ మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారధి, సత్యప్రసాద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. జీవో ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకోవడం కాదు.. బీసీలకు రిజర్వేషన్ హక్కుగా కల్పించాలి. బీసీ యువతను మోసం చేయకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాకపోవడానికి చంద్రబాబు కారణమైతే, ఆయన వెంట ఢిల్లీ వెళ్లిన బీసీ మంత్రులు ఈ ద్రోహానికి సాక్షులుగా మిగలకూడదు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి చేయగలిగిన పని చేయకుండా, ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టాలని చూస్తే బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు. బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇప్పుడు బీసీ యువతకు పూర్తిగా అర్థమైంది..
ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు డ్రామాలు చేస్తున్నారో బీసీలు తెలుసుకున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేవలం జీవోలు, ప్రకటనలు, ఢిల్లీ పర్యటనలతో కాలక్షేపం చేయడం బీసీలను మరోసారి మోసం చేయడమే. 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్నది రాజకీయ డ్రామానే.. ఈ డ్రామాకు అచ్చెన్నాయుడు, పార్థసారధి, సత్యప్రసాద్ సాక్షులుగా మిగిలారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మా ఎమ్మెల్యే చెప్పాడు.. అందర్నీ పంపండి!


