మంత్రి కొండా సురేఖపై చర్యల విషయంలో కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జన
డిప్యూటీ సీఎం భట్టి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో సీఎం సన్నిహితుడు వేం భేటీ
అంతర్గతంగా ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై కీలక చర్చ
వేటు వేయాల్సిందేనంటున్న సీఎం రేవంత్ సన్నిహిత ఎమ్మెల్యేలు
సీఎం హైదరాబాద్‌కు వచ్చాక ఎలాంటి సంకేతాలిస్తారన్న దానిపై ఉత్కంఠ
వచ్చే నెల 2 వరకు కేసీ వేణుగోపాల్ అందుబాటులో ఉండరంటున్న ఢిల్లీ వర్గాలు
గాందీభవన్‌లో భేటీ అయిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
మరో లేఖ రాసిన కొండా సురేఖ... ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉందని ఆరోపణ
వనపర్తిపై చిన్నారెడ్డి, మేఘారెడ్డి ప్రసంగాల వీడియోలు పరిశీలించిన కమిటీ
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సృష్టించిన వ్యాఖ్యల కలకలం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సురేఖను బర్తరఫ్ చేస్తారని, మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఇందుకు అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే ఆమెతో రాజీనామా చేయిస్తారని సీఎం వర్గం ప్రచారం చేస్తున్నా... అసలు ఏం చేయాలనే విషయంలో మాత్రం అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన మహిళా మంత్రి కావడం, ఇదే సమయంలో మరికొందరు ముఖ్య నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉండరన్న ఢిల్లీ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం వర్గం అప్రమత్తం
సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు కొండా ఎపిసోడ్‌లో తమ వంతు పావులు కదుపుతున్నారు. రేవంత్ సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్‌రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుటుంబ ఎపిసోడ్‌ను ఎలా ముగించాలన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెను తప్పించేలా అధిష్టానాన్ని ఒప్పించాలా లేదంటే ఆమెతో రాజీనామా చేయించాలా లేదా మరో మార్గంలో అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు చేయాలా అనే కోణంలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌కు రానుండటంతో ఆయన వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్‌లో ఎలాంటి సంకేతాలిస్తారన్నది కీలకంగా మారనుంది. ఆయన్ను కలిసి మాట్లాడతానని సురేఖ చెప్పిన నేపథ్యంలో ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చి కలుస్తారా లేదంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతారా? తనకు బహిరంగంగా మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవంత్‌కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సురేఖతో పాటు రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. కానీ, రేవంత్ కేబినెట్ సహచరులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం: క్రమశిక్షణ కమిటీ
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాం«దీభవన్‌లో సమావేశమైంది. చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు శ్యాంమోహన్ తదితరులు పాల్గొని కమిటీ ముందు పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. రేవంత్‌నుద్దేశించి సుస్మితా పటేల్ మాట్లాడిన వీడియోను పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గం విషయంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడిన వీడియోలను కూడా పరి«శీలించారు. అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. తమ నోటీసుకు సురేఖ ఇచ్చిన సమాధానాన్ని, సుస్మిత మాట్లాడిన వీడియోను కమిటీ పరిశీలించిందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. సురేఖ ఇచ్చిన వివరణ చదివిన తర్వాత మరోమారు సమావేశమై పరిశీలించాం. ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోకుండా, అందరి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై కమిటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
సీఎం గురించి ఎవరు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది’అని వెల్లడించారు. వనపర్తి విషయంలో కూడా ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలను కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు, ఎమ్మెల్యే ఫిర్యాదుకు తేడా ఉందని, మరోమారు ఎమ్మెల్యేను పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన పీఏసీ సమావేశం ఘటన గురించి కంది శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారని, డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్ గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
మాకు ఎవరిపై ప్రేమ ఉండదు...
తమకు పార్టీ నేతలెవరిపై వ్యక్తిగతంగా ప్రేమ, వ్యతిరేకత ఉండవని మల్లురవి స్పష్టం చేశారు. ‘మేం తీసుకునే ప్రతి చర్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దిశలోనే ఉంటుంది. పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ , కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిలకు నోటీసులిచ్చాం. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్తావన ఎమ్మెల్యేల మాటల్లో వచ్చింది కానీ ఫిర్యాదు మా దగ్గరకు రాలేదు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడింది నాకు తెలియంది కాదు కానీ పద్ధతి ప్రకారం నాకు ఫిర్యాదు రాలేదు. సుమోటోగా తీసుకోవాలా వద్దా అన్నది పరిశీలిస్తున్నాం. ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా పార్టీ వల్లనే. పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఎవరూ మాట్లాడకూడదు’అని ఆయన స్పష్టం చేశారు.
మరో లేఖ రాసిన సురేఖ
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ శనివారం మరో లేఖ రాశారు. ‘క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు నేను వివరణ ఇచ్చాను. అయినా కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, నాపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది’అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ కోరడం కొసమెరుపు.
చిన్నారెడ్డి వివరణ
వనపర్తి ఎమ్మెల్యే కారణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అంశాలను మాత్రమే తాను గోపాల్‌పేట సమావేశంలో ప్రస్తావించానే తప్ప ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయమని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలు తనకు దేవుళ్ల లాంటి వారని, తాను పార్టీని, పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని పేర్కొన్నారు, ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలతో 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడుతున్న బాధలనే ప్రస్తావించానని అన్నారు, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు.


