సంజూష్ పై ఎఫ్‌ఐఆర్‌ ‘ఖాళీ’! | Case registered with favorable sections to dilute the case | Sakshi
Sakshi News home page

సంజూష్ పై ఎఫ్‌ఐఆర్‌ ‘ఖాళీ’!

Aug 23 2026 4:42 AM | Updated on Aug 23 2026 4:42 AM

Case registered with favorable sections to dilute the case

నిందితుడి తండ్రి పేరు, చిరునామా ఖాళీగా వదిలేసిన పోలీసులు 

అదుపులోకి తీసుకోకుండా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేసిన వైనం 

కానీ ఫిర్యాదుదారు, మృతురాలి పేర్లు, పూర్తి చిరునామాలు మాత్రం నమోదు 

కేసును నీరుగార్చేందుకే అనుకూల సెక్షన్లతో కేసు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: సెల్‌ఫోన్‌ చోరీకి గురైతేనే పోలీసులు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదుదారు, అనుమానితుల పేర్లు, అడ్రస్‌లు, ఘటనాస్థలి తదితర వివరాలు నమోదు చేసే పోలీసులు.. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు సంజూష్ పై నమోదైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో మాత్రం కేవలం నిందితుడి పేరుతోనే సరిపెట్టేశారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ఈ నెల 16న నిందితుడు సంజూష్‌ తన ఆస్టన్‌ మార్టిన్‌ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి భారతి ముఖి (26) అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె మృతిచెందడం తెలిసిందే. 

ఈ ఘటనలో నిందితుడు సంజూష్ పై మాదాపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో కేవలం బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 (1) సెక్షన్‌ కింద మాత్రమే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువతి మృతికి స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. కారు నడిపిన సంజూష్‌ పూర్తి వివరాలు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదు. అదే ఎఫ్‌ఐఆర్‌లో ఫిర్యాదు చేసిన లైఫ్‌ స్టైల్‌ స్టోర్‌ మేనేజర్‌ పంజాల అశ్విన్‌ కుమార్, మృతురాలి వివరాలను మాత్రం ఇంటిపేరు, తండ్రి పేరు, పూర్తి చిరునామా, వయసు ఇలా అనేక వివరాలను నమోదు చేశారు. నిందితుడి తండ్రి జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ అని తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతోనే ఎఫ్‌ఐఆర్‌లో ఆ వివరాలు నమోదు చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రత్యక్ష సాక్షి బదులు..  
రోడ్డు ప్రమాద ఘటనకు ప్రత్యక్ష సాక్షి.. భారతి ముఖితో కలిసి రోడ్డు దాటుతున్న పూజ అశోక్‌ అలోనే అనే యువతి ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వారిద్దరూ పనిచేసే లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ మేనేజర్‌ పంజల అశ్విన్‌కుమార్‌ నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. తదుపరి దర్యాప్తును నీరుగార్చేందుకే పోలీసులు ఇలా వ్యవహరించారా అనే సందేహం కలుగుతోంది. చట్టపరమైన లొసుగుల ద్వారా నిందితుడిని కాపాడే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ను 105 ఎందుకు పెట్టలేదు? 
ఈ కేసులో పోలీసుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంజూష్‌ తేలికగా పోలీస్‌ స్టేషన్‌ నుంచి బెయిల్‌పై వెళ్లేలా సెక్షన్లు పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కేవలం అజాగ్రత్త లేదా నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంగా పేర్కొంటూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106 (1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీని కింద 5 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ.. నిందితుడికి పోలీస్‌ స్టేషన్‌ నుంచే లేదా కోర్టుకు వెళ్లిన వెంటనే సులువుగా బెయిల్‌ లభిస్తుంది. 

కానీ వాస్తవానికి సంజూష్‌ రద్దీగా ఉన్న ప్రాంతంలో అతివేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపినందున బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఈ సెక్షన్‌ కింద (మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి చేసిన చర్య అయితే) పదేళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌లోనిసెక్షన్‌ 184 (డేంజరస్‌ డ్రైవింగ్‌)ను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు.  

ఆసరాగా నిలుస్తానని చెప్పి..  
‘మా కష్టాలు తీర్చేందుకు అండగా ఉంటానంది.. కానీ ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోతుందనుకోలేదు’అంటూ లింగమనేని సంజూష్‌ కారుతో ఢీకొట్టడంతో మృతిచెందిన భారతిముఖి తల్లి ఆనందిని జాతీయ మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైంది. ఒడిశాకు చెందిన భారతిముఖిది మధ్యతరగతి కుటుంబం. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఆమెకు బీటెక్‌ సీటు కూడా వచ్చింది. అయితే కోవిడ్‌ వ్యాప్తి వల్ల చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచి్చంది. అయినా అధైర్యపడకుండా కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవాలని హైదరాబాద్‌ వచ్చి మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ఉద్యోగంలో చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement