కాంగ్రెస్ పాలనలోనే అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోజంతా పర్యటన
వివిధ శాఖలపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కల అలాగే మిగిలిపోయిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కడితే కమీషన్లు వస్తాయనే దొర పేదల ఇళ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి పర్యటించారు. పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. 400 డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పదేళ్లలో కేవలం 60 వేల ఇళ్లను మాత్రమే నిర్మించిందని, తాము మొదటి విడతలోనే 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, అర్హులైన ప్రతి ఆడబిడ్డకు ఇల్లు అందించేవరకు పథకాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. నాడు పింక్ షర్ట్ వేసుకున్న వారికే ఇళ్లను ఇచ్చారని, తాము ఏ పార్టీ అన్నది చూడకుండా అర్హులైన పేదలందరికీ ఇస్తున్నామని పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో రెవెన్యూ, హౌసింగ్, సర్వే, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసన
ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్ వరకు బీజేపీ నాయకులు చొచ్చుకువచ్చి నిరసన తెలిపారు. 22ఏ భూముల తప్పిదానికి బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తల నడుమ తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.


