● ఆర్మూర్ నుంచి తిరుమలకు జెండా బాలాజీ ప్రయాణం
● 220 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ
● నేడు ఆర్మూర్‌లో జెండా జాతర
ఆర్మూర్ : పట్టణంలోని వేంకటేశ్వర ఆలయ ఆవరణలో ఉ న్న జెండా మందిరంలో ఆదివారం ఏకాదశిని పురస్కరించుకొని జెండా జాతర నిర్వహించనున్నారు. రెండు శతాబ్దాల క్రితం నుంచి జెండా జాతర ఆనవాయితీగా వస్తోంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ కేంద్రంగా పాలన సా గించిన దొర గడ్డం వెంకట భూమారెడ్డి తిరుమల తిరు పతికి వెళ్లలేని భక్తుల కోసం ప్రారంభించినట్లు చెప్తుంటా రు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఆర్మూర్ సర్వసమాజ్ సభ్యు లు బాధ్యతగా భావించి భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు.
ఆక్షేపణలను అధిగమించి..
నిజాం నవాబుల కాలంలో జెండా పండుగ నిర్వహణకు చాలా అడ్డంకులు ఉండేవని పెద్దలు చెబుతుంటారు. జాతర జరపాలంటే జెండా కర్రకు వారికి నచ్చే రంగు, గుర్తులు ఉండేలా ఆదేశించేవారని, అయినా కూడా ఇక్కడి ప్రజలు హిందూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చినట్లు చెప్తుంటారు. జాతర కోసం తొమ్మిది రోజుల ముందు జెండా కర్రకు స్థానికంగా నేసిన 20 మీటర్ల పట్టు వస్త్రాన్ని ఉంచి దానిపై ఓం గుర్తును పెడతారు. జెండాను ప్రతిష్టించిన అనంతరం తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహిస్తుంటారు. అనంతరం సర్వసమాజ్, ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జాతరను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఊరేగింపుగా జెండా మందిరం నుంచి కాశీ హనుమాన్ వీధి, ఆలూర్ గైని, ధోబీఘాట్ మీదుగా అంకాపూర్ శివారు వరకు తీసుకెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అప్పగిస్తారు. అంకాపూర్‌లో 22 రోజులపాటు పూజలందుకుంటుంది. వినాయకచవితి తర్వాతి రోజు ఊరేగింపుగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వరకు తీసుకెళ్తారు. ఈ జెండాను గతంలో ముడుపులు కట్టి గ్రామగ్రామాన ఊరేగిస్తూ కాలినడకన తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేర్చేవారు. ప్రస్తుతం ప్రత్యేక వాహనంలో జెండాను తరలిస్తున్నారు.
నిజాం నవాబుల అడ్డంకులను ఎదుర్కొందీ జెండా. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లలేని భక్తుల కోసం ఏర్పడిందీ జెండా. 220 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ జెండాకు ముడుపు కడితే చాలు మొక్కులు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆర్మూర్‌లో ప్రారంభమై తిరుమల తిరుపతికి చేరుకునే ఈ జెండా జాతరపై ‘ఆదివారం’ ప్రత్యేక కథనం..
హిందూ సంప్రదాయ పరిరక్షణే లక్ష్యం
హిందూ సంప్రదాయాలను పరిరక్షించడమే లక్ష్యంగా 1973 నుంచి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నాను. ఆచారం ప్రకారం ముడుపులు కట్టి జెండాను తిరుమల వరకు చేర్చడం పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావించి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.
– జెండా సగ్వయ్ మధుకర్‌శర్మ, పూజారి, జెండా బాలాజీ మందిరం, ఆర్మూర్
జెండాకు ఘన చరిత్ర
నిజాములను ఎదురించి హిందూ సంప్రదాయాలను కొనసాగించిన ఆర్మూర్ ఘన చరిత్ర నేటికి జెండా రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఆర్మూర్ ప్రాంత హిందూ భక్తుల ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏటా జెండా పండుగలో ఇంటిల్లిపాదిమీ పాలు పంచుకుంటాం.
– పడాల్ మేయర్, భక్తుడు, ఆర్మూర్ పట్టణం


