ఎల్‌నినో ఉన్నా రెప్పపాటు కూడా కరెంట్‌ కోతల్లేవు | Deputy Chief Minister Bhatti at the inauguration of TGSPDCL Power Exhibition | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ఉన్నా రెప్పపాటు కూడా కరెంట్‌ కోతల్లేవు

Aug 23 2026 4:13 AM | Updated on Aug 23 2026 4:13 AM

Deputy Chief Minister Bhatti at the inauguration of TGSPDCL Power Exhibition

టీజీఎస్పీడీసీఎల్‌ పవర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంబోత్సవంలో ఉపముఖ్యమంత్రి భట్టి 

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్‌ రంగాన్ని మరింత బలోపేతం చేయబోతున్నాం. పరిశ్రమలు, వ్యవసాయం, సేవారంగం అభివృద్ధికి నిరంతర విద్యుత్‌ సరఫరా కీలకం. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 18 వేల మెగావాట్లకుపైగా పెరిగినప్పటికీ పక్కా ప్రణాళికలు, బలమైన ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థలతో రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చూస్తున్నాం’అని ఉపముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్‌ ఎగ్జిబిషన్‌–2026ను ఆయన ప్రారంభించారు. 

విద్యుత్‌ రంగానికి సంబంధించిన ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారుల సేవలు, భద్రతా ప్రమాణాలు, వి ద్యుత్‌ సంస్థల విజయాలను ప్రతిబింబించే స్టాళ్లను ఆయన పరిశీలించారు. టీజీఎస్పీడీసీఎల్‌ మస్కట్‌ను ఆవిష్కరించడంతోపాటు సంస్థ విజయాలు, సేవలు, సంస్కరణలపై రూపొందించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా హైడల్‌ విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గి అన్ని రంగాల విద్యుత్‌ వినియోగం రెట్టింపైనా సరఫరాలో రాజీపడటం లేదన్నారు.

ఉద్యోగుల సమష్టి కృషి వల్లే నిరంతరాయ విద్యుత్‌ సరఫరా సాధ్యమైందని చెప్పారు. 1912 టోల్‌ఫ్రీ సేవలు, పవర్‌ అంబులెన్స్‌ వ్యవస్థ, సాంకేతిక ఆధారిత సేవలు, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలతో అంతరాయాలు తగ్గాయని భట్టి వివరించారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్, ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణ భాస్క ర్, డిస్కం డైరెక్టర్లు బి.శివాజీ, ఎన్‌.నర్సింహులు, చక్రపాణి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలో సోలార్‌ విద్యుదుత్పత్తి  
ఆర్‌ అండ్‌ బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం ఉత్తర భాగంలో కార్‌ పార్కింగ్‌ స్థలంలో సోలార్‌ ప్యానెళ్లు అమర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డిసెంబర్‌ నాటికి పనులు పూర్తయి.. 90 వేల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. దీంతో నెలవారీ బిల్లులో 16 శాతం ఆదా కానుందని అధికారులు చెబుతున్నారు. శనివారం సచివాలయంలో సోలార్‌ ప్యానెళ్లు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, వంతెనల నిర్మాణ పనులపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలార్‌ నిర్మాణ నమూనాలను పరిశీలించారు. 

సచివాలయ భవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, భవనం ఎలివేషన్‌ దెబ్బతినకుండా మూడు వైపులా సోలార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా చూపించారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను 2026 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న పలు హై లెవెల్‌ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement