సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 37.31 శాతంగా ఉన్న డీఏను 40.04 శాతానికి పెంచింది. ఈ పెంపును 2024 జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డీఏ పెంపు కారణంగా ఉద్యోగుల బేసిక్ జీతంపై 6.43 శాతం మేర జీతాలు పెరగనున్నాయి.
కాగా, పెరిగిన డీఏను 2026 అక్టోబర్ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనున్నారు. అలాగే 2024 జూలై నుంచి 2026 సెప్టెంబర్ వరకు పెరిగిన డీఏకు సంబంధించిన బకాయిలను కూడా ఉద్యోగులకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
రివైజ్డ్ పే స్కేల్-2020 ప్రకారం పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచారు. అదేవిధంగా 2015 పే స్కేల్ కింద ఉన్న ఉద్యోగులకు డీఏ 78.06 శాతం నుంచి 81.728 శాతానికి పెరిగింది. UGC/AICTE పే స్కేల్-2016 కింద ఉన్న ఉద్యోగులకు డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. UGC/AICTE పే స్కేల్-2006 ఉద్యోగులకు డీఏ 239 శాతం నుంచి 246 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక పార్ట్‌టైమ్ అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. వారికి నెలకు అదనంగా రూ.100 చొప్పున పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తంగా డీఏ పెంపుతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ జీతం నుంచి అదనపు ప్రయోజనం లభించనుంది. గత బకాయిలను కూడా జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయడంతో ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఊరట కలగనుంది.
ఇదీ చదవండి: ‘కరోనా, ఎల్‌నినో కంటే కాంగ్రెస్ డేంజర్’


