ఓ వైపు కరెంటు కోతలు.. మరోవైపు జనంపై బిల్లుల వాతలు
ట్రూ అప్ చార్జీల పేరిట రూ.5,420 కోట్ల వసూలు దుర్మార్గం
విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టి జనంపై భారం
బిల్లుల పెంపు ఉపసంహరించకుంటే బీఆర్‌ఎస్ పోరు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు కరెంటు కోతలు, మరో వైపు విద్యుత్ బిల్లుల వాతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల పెంపుతో పిడుగు వేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ చార్జీల పేరిట రూ.5,420 కోట్లు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయాలనే దుర్మార్గ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రజలపై రూ.5 వేల కోట్ల భారాన్ని మోపాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తమను ఆదేశించారన్నారు.
‘విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఉద్యమించిన వారిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిన ఘటనకు 26 ఏళ్లు నిండాయి. ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో తెలంగాణ కరెంటు కష్టాలకు చరమగీతం పాడేందుకు ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని కేసీఆర్ తన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ వస్తే అంధకారం అలుముకుంటుందనే విమర్శలు, అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ తుగ్లక్ పాలనలో విద్యుత్ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుంది.
కాంగ్రెస్ తన తప్పిదాలతో విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజలపై భారాన్ని వేస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12,718.40 కోట్లు ట్రూ అప్ చార్జీలు విధించాలని ఈఆర్‌సీ కోరినా కేసీఆర్ ప్రజలపై భారం మోపేందుకు కేసీఆర్ అనుమతించలేదు. రూ.91 వేల కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం జెన్‌కో, ట్రాన్స్‌కో సహా మౌలిక వసతులను బలోపేతం చేశారు. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేలా రాష్ట్రాన్ని ‘పవర్ ఫుల్’గా తీర్చిదిద్దారు. కానీ రేవంత్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో విద్యుత్ రంగంలో కొత్త పనులేవీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటుకు కరోనా సోకినట్లుగా విద్యుత్ రంగం పరిస్థితి తయారైంది.
కరోనా, ఎల్‌నినో కంటే కాంగ్రెస్ పాలన డేంజర్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అవకాశమున్నా ప్రభుత్వం నీళ్లను లిఫ్ట్ చేయకుండా, బొగ్గు ఉన్నా కరెంటును ఉత్పత్తి చేయకుండా పాలన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు కుంటిసాకులు చెప్తోంది. సింగరేణి బొగ్గు సంస్థ ఉండి కూడా సింగరేణి థర్మల్ ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. రూ. 1,600 కోట్ల విలువ చేసే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయం అయ్యాయని, అదో పెద్ద కుంభకోణం అని మేం ముందు నుంచే హెచ్చరించాం’అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
‘ట్రాన్స్‌కో, జెన్‌కో, సింగరేణి, డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ట్రూ అప్ చార్జీల నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే మరో ప్రజా పోరాటానికి బీఆర్‌ఎస్ సిద్ధం’అని హరీశ్‌రావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్, పార్టీ నేత దేవీ ప్రసాద్ పాల్గొన్నారు.


