సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై వైఎస్సార్‌సీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. తాడిపత్రి, కడప, పుంగనూరు ప్రాంతాల్లో జరిగిన దాడులు, వైఎస్ అవినాశ్‌రెడ్డిపై దాడి ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
టీడీపీ నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, పోలీసుల సహకారంతో నామినేషన్లను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. శాంతియుతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
తాడిపత్రి, కడప, పుంగనూరులో దాడులు జరిగాయని, పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. పెట్రోల్ పంపుల వద్ద జరిగిన ఘటనల్లో కార్లు తగలబడితే క్రాకర్స్ వల్ల మంటలు చెలరేగాయని డీఎస్పీ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఒక్కచోటైనా ఎన్నికలు జరిగాయని చెప్పగలరా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, అన్ని ఎన్నికలను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి, పార్లమెంట్‌కు సిఫార్సు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు బొత్స తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో మాట్లాడినా ప్రయోజనం లేదని గవర్నర్‌కు వివరించామని తెలిపారు. ఎన్నికల కమిషనర్ గట్టిగా మాట్లాడితే రాజీనామా చేసి వెళ్లిపోతామని అంటున్నారని ఆరోపించారు. అంతేకాదు పోలీసులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాట వినడం లేదని విమర్శించారు. డీజీపీ తన విధులు కాకుండా చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ బాధ్యతలను లోకేష్ నిర్వహిస్తున్నట్లుగా పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
నామినేషన్ వేయకుండా అభ్యర్థులను కొట్టడం, తిట్టడం, అడ్డుకోవడం సరైన పద్ధతేనా? అని ప్రశ్నించారు. పూసపాటిలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే, ఆయన భార్య వచ్చి గొడవ చేయడంతో రిటర్నింగ్ అధికారి మళ్లీ ఎంపీపీని మార్చారని ఆరోపించారు. బీసీలకు కేటాయించిన స్థానాలను ఓసీలకు ఇచ్చారని బొత్స విమర్శించారు. ఈ వ్యవహారాలపై రెండు రోజుల్లో న్యాయస్థానం స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ తన పరిధిలో తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబు ముఖారవిందం చూసి, ఏడు రాష్ట్రాలకు అందగాడని ప్రజలు ఓట్లు వేశారా? ఒకవేళ ఆయన అందమే కారణం అయితే మళ్ళీ ఎన్నికలు పెట్టమని ఆయన మండిపడ్డారు. నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పిస్తే తాము 100 శాతం విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని, వాపును చూసి బలుపు అనుకొంటున్నారని బొత్స విమర్శించారు.
ఇదీ చదవండి: బంగారు ఉంగరం సాయంతో హత్య కేసు ఛేదన


