తాడేపల్లి: ఎన్నికలు జరిగిన తీరుపై చంద్రబాబు నాయుడు అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కొట్టారని, నామినేషన్లు చించేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బూత్‌ల బయట లాఠీఛార్జ్.. బూత్‌లలో రిగ్గింగ్ చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
‘‘చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం నడిబజారులో ఖూనీ అవుతోంది. టీడీపీ నేతల చేతుల్లో తన్నులు తిన్న నీలాంబరం చావుబతుకుల మధ్య ఉన్నాడు. నామినేషన్ విత్ డ్రాలు చేసుకునేలా కొడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉందా? వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిని టీడీపీ గూండాలు చంపారు.
రాజారెడ్డిని చంపిన గూండాలకు ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబే. రాజారెడ్డిని హత్య చేసిన వారికి చట్టప్రకారం పోరాడి శిక్షపడేలా వైఎస్సార్ చేశారు. సడెన్‌గా చంద్రబాబు నాయుడికి మానవ సంబంధాలు గుర్తుకువచ్చాయి. ఏడున్నర కోట్ల స్కామ్ జరిగితే జనసేన నేతలు ఎందుకు మాట్లాడరు? ధరణి కృష్ణను మూడు రోజుల పాటు తిప్పి హింసించారని చెబుతున్నారు. ధరణికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ధరణి కృష్ణను హింసిస‍్తుంటే జనసేన నేతలు ఎందుకు స్పందించరు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్ట్రైక్ రేట్ వెనుక ప్రజాదరణ లేదు
చంద్రబాబు చెబుతున్న స్ట్రైక్ రేట్ వెనుక ప్రజాదరణ లేదని, దౌర్జన్యాలు, అక్రమాలే ఉన్నాయని అంబటి రాంబాబు చెప్పారు.‘‘ప్రత్యర్థి పార్టీని పోటీలో లేకుండా చేసి గెలిచి.. నంబర్ వన్ అని చెప్పుకోవడం హాస్యాస్పదం. నామినేషన్ల దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అడుగడుగునా అక్రమాలే. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వారిపై దాడులు.. వేసిన నామినేషన్లను తిరస్కరించే కుట్రలు. పోలింగ్ కేంద్రాల బయట పోలీసుల లాఠీచార్జ్.. లోపల ఓట్ల అక్రమాలు జరిగాయి.
ఫ్యాన్ గుర్తుకు పడిన ఓట్ల కట్టలను సైకిల్ ఖాతాలో వేసి గెలిచినట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లా చేజర్లలో నామినేషన్ చెక్‌లిస్ట్‌లో సంతకం చేసి, తర్వాత సంతకం చేయలేదంటూ నామినేషన్ తిరస్కరించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సొంతూరైన బుర్రిపాలెంలో దళితుడిపై దాడి చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. నామినేషన్ ఉపసంహరించుకోలేదని నీలాంబరం గొంతుకు తాడు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. దళితుడిపై దాడి జరిగినా పోలీసులు వెంటనే కేసు తీసుకోలేదు.
బుర్రిపాలెం ఘటనపై పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానం చెప్పాలి. ఇన్ని అక్రమాలు చేసి ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ పెరిగిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. వైఎస్సార్ కుటుంబాన్ని చంద్రబాబు వేధించిన చరిత్రను ఎవరూ మర్చిపోలేదు. వైఎస్సార్ కుటుంబంపై కేసులు పెట్టించి వేధించిన రాజకీయాలను ప్రజలు మర్చిపోలేదు. రాజకీయ ప్రత్యర్థులు పక్కపక్కన కూర్చున్నా తట్టుకోలేని చంద్రబాబు.. ఇప్పుడు మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు.
బోండా ఉమా, ఏబీ వెంకటేశ్వరరావు, జోగి రమేష్ ఉదంతాల్లో మీ వైఖరి ఏమైంది చంద్రబాబూ? జనసేన కార్యాలయంలో ఉద్యోగాల పేరుతో రూ.7.5 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో ధరణి కృష్ణ అనే మహిళను పోలీసులు మూడు రోజులపాటు హింసించారు. ఉద్యోగాల పేరుతో రూ.7.5 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి. మహిళలకు అన్యాయం జరిగితే సహించమనే జనసేన నేతలు.. ధరణి కృష్ణ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.


