విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం ఎస్‌ఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఈసీ వద్దకు వచ్చిన వారిలో ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.
అనంతరం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పంచాయతీ మూడో దశ నామినేషన్ ప్రక్రియలో కూడా అదే తంతు సాగుతుంది. ప్రతి చిన్న గ్రామం నుంచి జరిగిన ఘటనలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకొని వచ్చాం. అనిల్ చంద్ర పునిత కింది స్థాయి అధికారులతో మాట్లాడారు. కింది స్థాయి అధికారులు మా నేతలకు రెస్పాండ్ అవ్వడం లేదు. 2 వేల పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
ఈ స్థాయిలో ఎప్పుడూ ఏకగ్రీవం కాలేదు. తండ్రీకొడుకులు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలిచ్చే తీర్పు అవకాశం లేకుండా నామినేషన్ వెయ్యనివ్వడం లేదు. నామినేషన్ వేస్తే పరిశీలనలో తొలగిస్తున్నారు. రోజు మా నాయకులు అన్ని ఆధారాలతో ఎస్‌ఈసీకి ఫిర్యాదు ఇస్తున్నాం. ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు నిర్వహించండి.. ప్రజలిచ్చిన తీర్పుకి అందరూ కట్టుబడి ఉన్నారు. కొన్ని ఫిర్యాదులు పరిష్కరించామని ఎస్‌ఈసీ చెబుతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం’’ అని అన్నారు.
నామినేషన్ వేయనివ్వకుండా ఉండేందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మండిపడ్డారు. ఎస్‌ఈసీకి మా మొర వినిపిస్తున్నాం. కడపలోని చక్రపాలెంలో నామినేషన్ కి రానివ్వడం లేదు. నామినేషన్ కేంద్రం వద్ద 700 మంది టీడీపీ వాళ్లు ఉండి దాడి చేస్తున్నారు. నామినేషన్ సెంట్రల్, బయట పోలీసులు ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదు.
పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొన్న వాళ్లలా ప్రవర్తిస్తున్నారు. కూటమి నేతలు రెండేళ్లలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగొచ్చుగా? ఇంటికి వెళ్తే ప్రజలు కూటమి నేతల్ని కొడతారు. ప్రజలు ఒప్పుకోకుండా.. ఓటు వేయకుండా ఏకగ్రీవం చేసుకుంటున్నారు. సత్తా ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలి. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా క్షేత్రంలో కచ్చితంగా మేము పోరాటం చేస్తాం’’ అని అన్నారు.


