మేయర్‌ శ్రావణికి పితృ వియోగం | Mukka Sravani Father Passes Away | Sakshi
Sakshi News home page

మేయర్‌ శ్రావణికి పితృ వియోగం

Nov 21 2026 1:12 PM | Updated on Nov 21 2026 1:12 PM

Mukka Sravani Father Passes Away

సీతంపేట: విశాఖపట్నం నగర మేయర్‌గా ఇటీవల ఎన్నికైన ముక్కా శ్రావణి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్‌ ముక్కా ముత్యాలనాయుడు శుక్రవారం గుండె పోటుతో మృతిచెందారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయన ఉదయం 7 గంటలైనా బయటకు రాకపోవడంతో, కుటుంబ సభ్యులు గుర్తించి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ముత్యాలనాయుడు పారీ్టలో క్రియాశీలక నేతగా కొనసాగుతూ 2007లో జీవీఎంసీ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 

ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో పెద్ద కుమార్తె నీలవేణి 49వ వార్డు కార్పొరేటర్‌గా, చిన్న కుమార్తె శ్రావణి నగర మేయర్‌గా గెలుపొందటంతో కుటుంబంలో పండగ వాతావణం నెలకొంది. శ్రావణి మేయర్‌గా 23న ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. దానికి రెండు రోజుల ముందే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ నాయకులు, అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్‌ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద ఉంచారు. శనివారం ఉదయం ఆయన స్వగ్రామమైన సీతారాంపురంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుమారుడు ముక్కా కిశోర్‌కుమార్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement