ప్రమాదంలో రెండుగా విడిపోయిన చేయి
హైదరాబాద్: డ్రిల్లింగ్ మెషీన్‌తో పనిచేస్తుండగా జరిగిన ప్రమాదంలో కుడి ముంజేయి పూర్తిగా తెగిపోయిన స్థితిలో వచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడికి హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి (హైటెక్‌సిటీ) వైద్యులు దాన్ని విజయవంతంగా తిరిగి అతికించారు. ప్రమాదం జరిగిన గంటలోపే బాధితుడు ఆస్పత్రికి చేరుకోవడంతో సుమారు 10 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి చేతిని కాపాడారు. ప్రస్తుతం ఆ చేతికి తిరిగి రక్తప్రసరణ సాధారణంగా ఉండటంతోపాటు వేళ్లలో కదలిక, స్పర్శ కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆర్థోపెడిక్స్, ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, జనరల్ సర్జరీ, అనస్తీషియా విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.
ముందుగా దెబ్బతిన్న కణజాలాన్ని శుభ్రపరిచి ముంజేతిలోని రెండు ఎముకలను ప్లేట్ల సాయంతో స్థిరీకరించారు. అనంతరం చేతికి రక్తప్రసరణను పునరుద్ధరించి దెబ్బతిన్న మృదు కణజాలాన్ని పునర్నిర్మించారు. తెగిపోయిన అవయవాన్ని తిరిగి అమర్చడం క్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సల్లో ఒకటన్నారు. ప్రమాద తీవ్రత, రోగి ఎంత త్వరగా ప్రత్యేక ట్రామా సెంటర్‌కు చేరుకున్నారన్నది కూడా చికిత్స ఫలితాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. పూర్తిగా తెగిపోయిన అవయవాన్ని సజీవంగా ఉంచడం ప్రధాన సవాలుగా మారిందని కేర్ ఆస్పత్రి హైటెక్‌సిటీ సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ దివ్యసాయి నర్సింగం చెప్పారు. కానీ అన్ని విభాగాల డాక్టర్ల సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు.
తెగిపోయిన అవయవాన్ని ఎలా తేవాలంటే: ప్రమాదంలో చేయి లేదా ఇతర అవయవం పూర్తిగా తెగిపోతే దాన్ని కూడా రోగితోపాటు వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకురావాలని వైద్యులు సూచించారు. తెగిపోయిన భాగాన్ని శుభ్రమైన సీల్డ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లో భద్రపరిచి చల్లగా ఉండేలా చూడాలని సూచించారు. కానీ నేరుగా ఐస్ క్యూబ్‌లు లేదా మంచు గడ్డలపై మాత్రం అవయవాన్ని పెట్టకూడదన్నారు.
ఇదీ చదవండి: మూడేళ్ళ లవ్.. 3 సార్లు అబార్షన్..


