రాహుల్‌జీ.. మౌనమేల? | Women polytechnic students met Harish Rao on Go 97 | Sakshi
Sakshi News home page

రాహుల్‌జీ.. మౌనమేల?

Aug 23 2026 4:27 AM | Updated on Aug 23 2026 4:27 AM

Women polytechnic students met Harish Rao on Go 97

ఢిల్లీలో ఒక న్యాయం, ఇక్కడ మరో న్యాయమా?

జీవో 97పై హరీశ్‌రావు ఆగ్రహం  

సిద్దిపేటజోన్‌: ఢిల్లీలో విద్యార్థులకు అన్యాయం జరిగితే వెళ్లి పరామర్శించిన రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో పాలిటెక్నిక్‌ విద్యార్థులపై అమానుషంగా వ్యవహరిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని, రాహుల్‌గాంధీకి ఢిల్లీలో ఒక న్యాయం.. తెలంగాణలో ఇంకో న్యాయం ఉంటుందా? అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా పాలిటెక్నిక్‌ విద్యార్థులు జీవో 97పై హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ విద్యార్థుల గొంతు నొక్కుతుంటే రాహుల్‌ గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పి జీవో 97 ఎందుకు రద్దు చేయించడం లేదని ప్రశ్నించారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో ఒక సీఐ పాలిటెక్నిక్‌ విద్యార్థిపై దారుణంగా వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. తాను ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థ బలోపేతానికి ఒకేసారి 400 మంది కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో 97 ద్వారా పాలిటెక్నిక్‌ వ్యవస్థను కూలదోసేందుకు చూస్తున్నట్టు ఆరోపించారు. 

సమస్యలపై మంత్రిని విద్యార్థులు కలిసి విజ్ఞప్తి చేస్తే.. మంత్రి స్థానంలో ఉండి తప్పును సరిదిద్దుతామని చెప్పాల్సింది పోయి.. హామీ ఇవ్వలేనంటూ మాట్లాడడం ఆయన బాధ్యతారాహిత్య వైఖరికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులు అధైర్య పడొద్దని పాలిటెక్నిక్‌ విద్యార్థుల న్యాయ పోరాటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, జీవో 97 రద్దయ్యేంత వరకు మీ వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సెప్టెంబర్‌ మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు.

లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని దాదాపు 6 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో తనను కలిసిన సర్వేయర్ల ప్రతినిధి బృందంతో ఆయన మాట్లాడారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన సర్వేయర్ల పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించిన తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement