ప్రత్యేక నైపుణ్యమున్న వ్యవస్థలు అవసరం
హైకోర్టు సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్
టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, సైబర్ రంగాలపై చర్చ
పాల్గొన్న జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ మొహియుద్దీన్, జస్టిస్ రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టెలికం, ప్రసార రంగం, విమానాశ్రయ టారిఫ్‌లు, సైబర్ టెక్నాలజీ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తలెత్తే సాంకేతిక, నియంత్రణ వివాదాలను సమర్థవంతంగా, సత్వరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ పేరొన్నారు. దీని కోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన వివాద పరిష్కార వ్యవస్థలు అవసరమని అభిప్రాయపడ్డారు. ‘విమానాశ్రయ టారిఫ్‌లు, టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, సైబర్ రంగాల్లో వివాదాల పరిష్కారం’అనే అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
సాంకేతికంగా క్లిష్టమైన నియంత్రణ వివాదాలను పరిష్కరించడంలో ప్రత్యేక న్యాయ సంస్థల ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. 1997లో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), 2000లో టెలికం వివాదాల పరిష్కార, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) ఏర్పాటు ఈ పరిణామంలో కీలక మైలురాళ్లని పేర్కొన్నారు. తొలుత టెలికం రంగానికే పరిమితమైన టీడీశాట్ పరిధి తర్వాత బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సేవలు, విమానాశ్రయ టారిఫ్‌లకు సంబంధించిన వివాదాలకు కూడా విస్తరించిందని జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ తెలిపారు.
ట్రిబ్యునళ్లు న్యాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదని, దానికి అనుబంధంగా పనిచేస్తూనే రాజ్యాంగపరమైన న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. సాంకేతికత, ఏఐ న్యాయ నిర్ణయ ప్రక్రియకు సాయంగా ఉండగలవని, అయితే న్యాయపరమైన తర్కం, జవాబుదారీతనం, మానవ పర్యవేక్షణకు అవి ప్రత్యామ్నాయం కాలేవని స్పష్టం చేశారు.
రూ.5 కోట్ల వరకు సైబర్ వివాదాలు
టీడీశాట్ చైర్మన్ జస్టిస్ డీఎన్ పటేల్ మా ట్లాడుతూ సివిల్ స్వభావమున్న సైబర్ వివాదాల్లో తొలుత నియమిత అడ్జుడికేటింగ్ అధికారి విచారణ చేపడతారని.. రూ.5 కోట్లలోపు పరిహారం కోరే క్లెయిమ్‌లను విచారించే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. ఆ ఉత్తర్వులపై టీడీశాట్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. రూ.5 కోట్లకు మించిన క్లెయిమ్‌లను సివిల్ కోర్టులు విచారిస్తాయన్నారు.
సైబర్ కేసుల్లో క్రిమినల్‌తోపాటు సివిల్ కేసును ఒకేసారి దాఖలు చేయొచ్చని సూచించారు. జస్టిస్ శామ్‌కోషి, ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎస్.సురేందర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్‌రెడ్డి, టీజీఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి పంచాక్షరి, హెచ్‌సీఏఏ ఉపా ధ్యక్షుడు డీఎల్ పాండు పాల్గొన్నారు.


