ఫ్రీహోల్డ్‌కు ఉచ్చు! | - | Sakshi
Sakshi News home page

ఫ్రీహోల్డ్‌కు ఉచ్చు!

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

22–ఏ భూములపై చంద్రబాబు ప్రభుత్వం డ్రామా.. రెండున్నరేళ్లుగా రైతులకు ఇక్కట్లు ఉమ్మడి ప్రకాశంలో 1.84 లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించిన వైఎస్‌ జగన్‌ గద్దెనెక్కగానే వాటిని మళ్లీ 22–ఏలో పెట్టిన చంద్రబాబు తానేదో కొత్తగా హక్కులు కల్పిస్తున్నట్లుగా గప్పాలు గతంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు అండ్‌ కో విష ప్రచారం వాస్తవాలు నిరూపించలేక రెండున్నరేళ్లుగా గిరికీలు క్షేత్రస్థాయి విచారణ పేరుతో రైతుల హక్కులు హరించే కుట్ర స్వల్ప తప్పిదాలను బూచిగా చూపి వేలాది మందిని ఇబ్బంది పెట్టడంపై విమర్శలు

15 రోజుల గడువు బోగస్సే..

బేస్తవారిపేట:

శాబ్దాల పాటు భూమిని నమ్ముకున్న పేద, బడుగు, బలహీన వర్గాల రైతులకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో దక్కిన భూ హక్కులను కాలరాయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 20 ఏళ్లకు పైగా అసైన్డ్‌ భూములను సాగు చేసుకుంటున్న నిరుపేదలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చారిత్రక జీవో 596 ద్వారా చేపట్టిన ఫ్రీహోల్డ్‌ ప్రక్రియపై కూటమి సర్కారు కక్షగట్టింది. విచారణల పేరిట నిబంధనల ఉల్లంఘనల బూచిని చూపిస్తూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షలాది మంది రైతుల నోట్లో మట్టికొడుతోంది. లక్షలాది మంది పేదలకు మేలు చేసేలా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ, జనసేన ఎన్నికల ముందు నానా యాగీ చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసి చంద్రబాబు అధికారంలోకి రాగానే గతంలో వైఎస్‌ జగన్‌ ఫ్రీహోల్డ్‌ చేసిన భూములను మళ్లీ 22–ఏలో పెట్టేశారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సరికొత్త డ్రామాకు సీఎం చంద్రబాబు తెరదీశారు. నిషేధిత భూముల జాబితాను సరళీకరిస్తామని చెప్పి విచారణల పేరుతో కాలయాపన చేస్తోంది.

పేద రైతులకు తీరని అన్యాయం:

జీవో 596 ద్వారా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 1.36 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చాయి. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమాలు, బినామీ కొనుగోళ్ల వంకతో ఈ భూముల రిజిస్ట్రేషన్లను, సీరియల్‌ నంబర్ల కేటాయింపును పూర్తిగా నిలిపేసింది. మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం పేరుతో నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెట్టడం వల్ల అసలైన పేద రైతులు అత్యవసర సమయాల్లో తమ భూములను అమ్ముకోలేక, రుణాలు పొందలేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

పశ్చిమ ప్రకాశంలో భయానక వాతావరణం

మార్కాపురం, యర్రగొండపాలెం, కొనకనమిట్ల, పుల్లలచెరువు మండలాల్లో పేదలకు ఇచ్చిన ఎన్‌వోసీలపై విచారణల పేరుతో రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పేద రైతులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత ప్రభుత్వం నిరుపేదలకు కల్పించిన చట్టబద్ధమైన హక్కులను లాక్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఆపి, తక్షణమే ఫ్రీహోల్డ్‌ భూములపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని జిల్లా రైతాంగం డిమాండ్‌ చేస్తోంది.

పేరుకే డీ–నోటిఫికేషన్‌:

22–ఏ నుంచి ఐదు రకాల భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. 1954 జూన్‌ 18కి ముందు కేటాయించిన పాత అసైన్డ్‌ భూములు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితుల భూములు, అలాగే రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల 22–ఏలో చేరిన ప్రైవేటు పట్టా భూములు, సర్వీస్‌ ఇనాం భూములతో పాటు కోర్టు ఉత్తర్వులు పొందిన ప్రైవేటు స్థలాలకు హక్కులు కల్పిస్తామని ఊదరగొడుతోంది. కానీ, అధికారుల క్లరికల్‌ తప్పిదాల వల్ల నిషేధ జాబితాలోకి వెళ్లిన సొంత పట్టా భూములను విడిపించుకోవడానికి కూడా రైతులు 30 ఏళ్ల లింక్‌ డాక్యుమెంట్లు, ఈసీలు, ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డులతో మీ–సేవ కేంద్రాలు, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. తప్పు చేసింది రెవెన్యూ యంత్రాంగమైతే, నిరూపణ భారం పేద రైతులపై మోపడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.

సమస్యల పరిష్కారంలో నత్తకు మేనత్తలా..

వివాద రహిత భూముల తొలగింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించామని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిష్కారం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం డివిజన్లలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో సమస్యలు పెండింగ్‌లో ఉండగా, మొదటి విడతలో కేవలం 106 ఫైళ్లను మాత్రమే పరిష్కరించి పెద్ద విజయం సాధించినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా మారింది.

వెబ్‌ల్యాండ్‌ 2.0 ద్వారా ఆటో ఐడెంటిఫికేషన్‌ చేసి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్న హామీ ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. అక్రమార్కులపై చర్యల పేరుతో అమాయక రైతుల భూ హక్కులను హరించడం, రిజిస్ట్రేషన్లను స్తంభింపజేయడంపై కర్షకులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కమిటీల పేరుతో కాలయాపన ఆపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అసలైన లబ్ధిదారులకు ఫ్రీహోల్డ్‌ హక్కులను తక్షణమే పునరుద్ధరించాలని, 22–ఏలోని ప్రైవేటు భూములను బేషరతుగా తొలగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement