మేత భూమిని మేసేశారు! | - | Sakshi
Sakshi News home page

మేత భూమిని మేసేశారు!

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

పశువుల పోరంబోకు భూమిలో జామాయిల్‌, మామిడి తోటల పెంపకం రూ.5 కోట్ల విలువైన 45 ఎకరాల భూమిని ఆక్రమించిన అధికార పార్టీ నాయకుడు పశువులు మేతకు ఉపయోగించే భూములను రక్షించాలని గ్రామస్తుల వేడుకోలు

గుడ్లూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు ఇష్టారీతిగా ఆక్రమిస్తున్నారు. మండలంలోని చినలాటరఫి పంచాయతీ జానకంపేట సమీపంలో రూ.5 కోట్ల విలువైన పశువుల పోరంబోకు భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించి పంటలు సాగు చేసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గుడ్లూరు మండలం చినలాటరఫి పంచాయతీ జానికంపేట సమీపంలో ఉద్యానవన కళాశాల నిర్మాణానికి 124 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. చుట్టూ హద్దులు ఏర్పరిచారు. అయితే దానికి చుట్టుపక్కల 601 నుంచి 612 సర్వే నంబర్లలో సుమారు 45 ఎకరాల పశువుల పోరంబోకు భూమి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భూమిని చినలాటరఫి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నూతలపాటి తిరుపతి వెంకయ్య అలియాస్‌ బుల్లియ్య అంచెలంచెలుగా ఆక్రమించి జామాయిల్‌, మామిడి తోటలు పెంచుతున్నాడని జానికంపేట గ్రామస్తులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో మరికొంత భూమిలో జేసీబీతో గుంతలు, మిట్టలు చదును చేసి ట్రాక్టర్లతో దున్నేసి గుంతలు తీసి మొక్కలు వేయడానికి సిద్ధం చేశాడు. ఇన్నాళ్లు ఆ భూముల్లో తమ పశువులను మేపుకుంటున్నామని, ఇప్పుడు తాము మేత కోసం ఎక్కడకు వెళ్లాలంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కందుకూరు సబ్‌కలెక్టర్‌ హిమవంశీకి జానికంపేట గ్రామస్తులు కాపులూరి కొండలరావు, గుండ్లపల్లి శివ ఫిర్యాదు చేశారు. ఆక్రమణల చెర నుంచి పశువుల పోరంబోకు భూమిని విడిపించి పశువుల మేత కోసం అలాగే ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ బాలకిశోర్‌ను వివరణ కోరగా ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement