తెల్లదొరల తుపాకీకి రొమ్ము విరిచి ఎదురెళ్లిన ధీరుడు
నేడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి
ఘనంగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
ఒంగోలు సబర్బన్: స్వతంత్య్రోద్యమంలో చురుకై న పాత్ర పోషించిన మహనీయుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు ఒకరు. నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం ఆయన స్వస్థలం. 1872 ఆగస్టు 23న వెంకట నరసింహులు, సుబ్బమ్మ దంపతులకు టంగుటూరి జన్మించారు. పదకొండో ఏటనే తండ్రిని కోల్పోయిన ఆయన ఒంగోలు సమీపంలోని వల్లూరులో ప్రాథమిక విద్య అభ్యసించారు. అనంతరం రాజమండ్రిలో ఎఫ్‌ఏ, మద్రాసులో న్యాయశాస్త్రం చదివారు. కొంతకాలం ఒంగోలు, రాజమండ్రిలో పురపాలక సంఘ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1904లో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తిచేసి 1907లో భారత్‌కు వచ్చి న్యాయవాద వృత్తి కొనసాగించారు. న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్య్ర పోరాటంలోకి అడుగుపెట్టారు. యావదాస్తిని ప్రజలకు రాసిచ్చారు. స్వరాజ్య పోరాటంలో 1928లో సైమన్ కమిషన్‌కు ఎదురుతిరిగారు. తెల్లవారి తుపాకీకి తన గుండెను ఎదురొడ్డి ఆంధ్రకేసరిగా వినుతికెక్కారు. గాంధీజీ పిలుపు మేరకు ఒంగోలు మండలం దేవరంపాడు శివారు గుండ్లకమ్మ నది ఒడ్డున ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఇక్కడ 1935 నవంబర్ 21న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ విజయ సూ్‌ాథ్పన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీజీ నుంచి ప్రకాశం పంతులుకు వచ్చిన అభినందన లేఖ ఇప్పటికీ దేవరంపాడు గ్రంథాలయంలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా టంగుటూరి ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1953 అక్టోబర్‌లో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1957 మే 20న కన్నుమూశారు. జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న అప్పటి వరకు ఉన్న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని నిర్వహిస్తోంది. నేడు ప్రకాశం పంతులు 155వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం ప్రకాశం భవన్‌లో ఉదయం గం.9.30కు జయంతి వేడుకలు నిర్వహిస్తారు. కలెక్టర్ పి.రాజా బాబు, జేసీ కల్పనా కుమారి, ఇతర ముఖ్య అతిథులు ప్రకాశం పంతులు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆయన కుటుంబ సభ్యులను సన్మానిస్తారు. అనంతరం నాగులుప్పలపాడు మండలం దేవరంపాడు చేరుకుని అక్కడ ఉన్న విజయస్థూపం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వినోదరాయునిపాలెంలోని ఆయన నివాసం వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
పౌరుషమే ప్రాణంగా.. త్యాగమే తరగని ధనంగా.. చెక్కుచెదరని ప్రజాభిమానమే ఊపిరిగా చిర యశస్సును ఆర్జించారు టంగుటూరి ప్రకాశం పంతులు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన చూపిన తెగువ.. అకుంఠిత దేశభక్తి చిరస్మరణీయం. నేడు ఆ మహనీయుని 155వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రభుత్వ యంత్రాంగం ఘన నివాళులర్పించనుంది.


