వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి హార్ముజ్ జలసంధి వద్దకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గాన్ని ‘NEW US Territory’గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో మరోసారి పోస్టు చేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆగస్టు 18న ఇదే చిత్రాన్ని తొలిసారి షేర్ చేసిన ట్రంప్.. తాజాగా మళ్లీ దాన్ని పంచుకోవడం ద్వారా హార్ముజ్‌పై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న సంకేతం ఇచ్చారు.
అంతకుముందు ఆగస్టు 14న లాంగ్ ఐలాండ్‌లోని పోలీస్ అకాడమీలో మాట్లాడిన ట్రంప్.. ‘త్వరలోనే హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తాను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేయడం లేదా అధ్యక్షుడి ప్రకటనతోనే హార్ముజ్‌పై అమెరికాకు చట్టపరమైన సార్వభౌమాధికారం ఏర్పడదు. ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తుతానికి రాజకీయ, వ్యూహాత్మక ఒత్తిడిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవలేని అమెరికా అసమర్థతకు, అదే జలసంధిని సొంతం చేసుకుంటామన్న వాదనకు మధ్య ఉన్న అంతరం.. వాషింగ్టన్ నుంచి హార్ముజ్ వరకు ఉన్న 7,000 మైళ్ల దూరం కంటే ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా అనంతర వ్యవస్థకు స్వాగతం అంటూ అమెరికాకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.
🔴President Trump just posted a map labeling the Strait of Hormuz as “NEW U.S. Territory.” The critical waterway is clearly circled and claimed. This follows his repeated statements that America now controls the Strait. Iran’s ability to threaten global oil shipping is being… pic.twitter.com/4TbQoFMNWC
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) August 22, 2026
ఇదే సమయంలో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌పై ఇప్పటివరకు లేనంత కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న చైనాపై కూడా వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు సహకరించే దేశాలు, సంస్థలపై ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్ విధించబోయే ద్వితీయ ఆంక్షలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి ఆధారం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికా ఆర్థిక యుద్ధంలో తమతో చుట్టుపక్కల దేశాలు చేరితే వాటిని శత్రువులుగా పరిగణిస్తామని రెజాయీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఎల్‌నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం!
ప్రస్తుతం అసలు సమస్య అంతా హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతోంది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ఈ మార్గంలో చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణా భారీగా దెబ్బతింది. కొద్దిమంది వాణిజ్య నౌకలు మాత్రమే జలసంధిని దాటుతుండగా.. పెద్ద సంఖ్యలో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ఎల్‌ఎన్‌జీ నౌకలు రాకపోకలకు దూరంగా ఉంటున్నాయి. ఇరాక్ విజ్ఞప్తి మేరకు కొన్ని ఇరాకీ చమురు నౌకలకు మాత్రం హార్ముజ్ గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించినట్లు సమాచారం. హార్ముజ్ సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే దాని ప్రభావం అమెరికా, ఇరాన్‌లకే పరిమితం కాకపోవచ్చు. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, పరిశ్రమల వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది.


