చైనా రూటే సెపరేటు  | China is launching a Moon mission to find water ice | Sakshi
Sakshi News home page

చైనా రూటే సెపరేటు 

Aug 23 2026 5:30 AM | Updated on Aug 23 2026 6:45 AM

China is launching a Moon mission to find water ice

జాబిల్లిపైకి చాంగీ–7 ప్రయోగం త్వరలో 

నీటి రూపురేఖలు, వాడకాలపై పరిశోధనలు 

రష్యాతో కలిసి రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రణాళికలు

జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద నీళ్లున్నాయని తెలుసు. కానీ ఏ రూపంలో? ఎంత మోతాదులో? మనం వాడుకోగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు తెలియనున్నాయి. అంతా చైనా ప్రయోగిస్తున్న ఛాంగీ–7 యాత్ర ఫలితం. ఒక పక్క నాసా తన ఆర్టిమిస్‌–3 ప్రోగ్రామ్‌ ద్వారా జాబిల్లిపై శాశ్వత మానవ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తూంటే.. ఇంకోవైపున చైనా వినూత్నమైన రీతిలో జాబిల్లిపై తన ముద్ర వేసేందుకు కృషి చేస్తూండటం విశేషం. 
 
జాబిల్లిపై నీరున్న విషయం తెలిసి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. తెలియనిదల్లా అది ఏ రూపంలో ఉంది? వంటి వివరాలు మాత్రమే. ఎందుకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యరశ్మి సోకని అంటే వెలుగు అస్సలు లేని ప్రాంతంలో నీటి ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి ఉష్ణోగ్రతలు –200 డిగ్రీ సెల్సియస్‌ వరకూ ఉంటాయని అంచనా. 

అంతటి శీతల పరిస్థితుల్లో నీరు ఏ రూపంలో ఉందో? మనం దాన్ని ఎలా వాడకానికి అనువుగా మార్చుకోవాలో ఇప్పటివరకూ తెలియదు. ఈ లోపాలన్నింటినీ సరిదిద్దేందుకు చైనా ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో జరిగే చాంగీ–7 ప్రయోగం ఈ దిశగా వేస్తున్న తొలి అడుగు. జాబల్లిపైకి ఇటీవలే జరిగిన ఒక ప్రయోగం విఫలమైనప్పటికీ చైనా సరికొత ఇంజిన్‌తో తాజా ప్రయత్నం చేస్తోంది. 

చాంగీ–7 లక్ష్యాలేమిటి? 
ఇప్పటివరకూ జాబిల్లి దక్షిణ ధ్రువం పైకి జరిగిన అంతరిక్ష ప్రయోగాల కంటే చాంగీ–7 భిన్నమైంది. ఎందుకంటే ఇందులో ఒక ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తోపాటు ఒక హాపర్‌ కూడా ఉంటాయి. 2024 మార్చిలోనే ప్రయోగించి ప్రస్తుతం కక్ష్యలో ఉన్న క్యూకియా–2 రిలే శాటిలైట్‌ కూడా చాంగీ–7 ప్రయోగానికి ఎంతో ఉపయోగపడనుంది. 

చాంగీ–7 కచ్చితంగా ఎక్కడ ల్యాండ్‌ అవుతుందన్నది ఇప్పటికైతే తెలియదు కానీ.. ఆర్టిమిస్‌–3 ద్వారా నాసా ఏర్పాటు చేయాలని అనుకుంటున్న కేంద్రం కోసం ఎంపిక చేసిన షాకిల్‌టన్‌ క్రేటర్‌కు సమీపంలోనే సూర్యరశ్మి తాకే చోట ఉండవచ్చునని అంచనా. ఈ మొత్తం ప్రయోగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘హాపర్‌’గురించి. ఇది చక్రాలున్న రోవర్‌ లాంటిది కాదు. అక్కడి నేలలో గుంతల్లాంటివి కానీ, నెర్రెలు కానీ ఉంటే వాటిని దాటేందుకు ఎగరగల సామర్థ్యం ఉన్నది. సాధారణ వాహనాలు ప్రయాణించలేని లోతులకు కూడా ఇది వెళ్లగలదు. 

ఆర్టిమిస్‌–3 ద్వారా నాసా కూడా జాబిల్లిపైని నీటిని, వనరులను గుర్తించి వాడుకునేందుకు చైనా కంటే భిన్నమైన మార్గంలో ప్రయత్నిస్తోంది. చాంగీ–7 చైనా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు కాగా... నైసా వాణిజ్యస్థాయిలో ప్రైవేట్‌ సంస్థల ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చాంగీ–7 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఉపయోగించదగ్గ వనరులు ఏమేం ఉన్నాయి? అన్నదానిపై కూడా దృష్టి పెట్టనుంది. 

రెండేళ్ల తరువాత అంటే 2028లో జరిగే చాంగీ–8 ద్వారా ఈ వనరులను వాడుకోవడం ఎలా? అన్నదాన్ని పరిశీలించాలన్నది చైనా ఆలోచన. తరువాతి దశలో భాగంగా మానవ సిబ్బంది జాబిల్లిపైకి చేరతారు. చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మిని్రస్టేషన్, రష్యాకు చెందిన రస్‌కాస్మోస్‌ స్పేస్‌ ఏజెన్సీలు రెండు కలిసి ‘‘ఇంటర్నేషనల్‌ లూనార్‌ రీసెర్చ్‌ స్టేషన్‌’’నిర్మాణం చేపడతాయి. ఏతావాతా... జాబిల్లిపైకి చేరడం ఎలా అన్నది 20వ శతాబ్ధపు అతిపెద్ద సాంకేతికపరమైన సవాలుగా నిలిస్తే... మనిషి అక్కడ ఎలా బతకాలన్నది ఈ శతాబ్ధపు ముఖ్యమైన ప్రశ్నగా అవతరిస్తోందన్నమాట!!! 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement