ఆ నిర్ణయం చెల్లదు! | US Federal judge vacates Trump suspended processing of immigration visas | Sakshi
Sakshi News home page

ఆ నిర్ణయం చెల్లదు!

Aug 23 2026 5:35 AM | Updated on Aug 23 2026 5:35 AM

US Federal judge vacates Trump suspended processing of immigration visas

కోర్టులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

వాషింగ్టన్‌:  అఫ్గానిస్తాన్, ఇరాన్, రష్యా, సోమాలియాతో సహా 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్‌ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యూయార్క్‌లోని యూఎస్‌ డి్రస్టిక్ట్‌ జడ్జి జెనెట్‌ వర్గాస్‌ శుక్రవారం రద్దు చేశారు. ట్రంప్‌ సర్కార్‌ వైఖరి చట్ట విరుద్ధంగా, శాసనాధికారాన్ని ధిక్కరించేలా ఉందని తేల్చిచెప్పారు. 

జడ్జి జెనెట్‌ వర్గాస్‌ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించిన న్యాయమూర్తి కావడం విశేషం. ఏ వీసా నిర్ణయంలోనైనా కాన్సులర్‌ అధికారులకే అగ్రస్థానం ఇవ్వాలన్న కాంగ్రెస్‌ నిబంధనను కూడా ఈ విధానం బలహీనపరుస్తుందని వర్గాస్‌ అన్నారు. ఒక వలసదారుడు వీసాకు అర్హుడా కాదా అని నిర్ణయించే ప్రత్యేక అధికారాన్ని, విచక్షణాధికారాన్ని కాంగ్రెస్‌ కాన్సులర్‌ అధికారులకు కల్పించిందని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి జాతీయత ఆధారంగా ఇమ్మిగ్రేషన్‌ వీసాల జారీని నిషేధించే ఈ విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. 

అర్హులైన దరఖాస్తుదారులకు వీసాలను నిరాకరించాలని ఆదేశించడం ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని వ్యతిరేకించడమే అవుతుందని పేర్కొన్నారు. 75 దేశాల పౌరులకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ వీసాలు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, 11 మంది వ్యక్తులు కోర్టులో సవాలు చేశారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జడ్జి జెనెట్‌ వర్గాస్‌ విచారణ చేపట్టారు. 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్‌ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం చెల్లదని తీర్పు వెలువరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement