breaking news
Jeannette
-
ఆ నిర్ణయం చెల్లదు!
వాషింగ్టన్: అఫ్గానిస్తాన్, ఇరాన్, రష్యా, సోమాలియాతో సహా 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యూయార్క్‌లోని యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి జెనెట్ వర్గాస్ శుక్రవారం రద్దు చేశారు. ట్రంప్ సర్కార్ వైఖరి చట్ట విరుద్ధంగా, శాసనాధికారాన్ని ధిక్కరించేలా ఉందని తేల్చిచెప్పారు. జడ్జి జెనెట్ వర్గాస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన న్యాయమూర్తి కావడం విశేషం. ఏ వీసా నిర్ణయంలోనైనా కాన్సులర్ అధికారులకే అగ్రస్థానం ఇవ్వాలన్న కాంగ్రెస్ నిబంధనను కూడా ఈ విధానం బలహీనపరుస్తుందని వర్గాస్ అన్నారు. ఒక వలసదారుడు వీసాకు అర్హుడా కాదా అని నిర్ణయించే ప్రత్యేక అధికారాన్ని, విచక్షణాధికారాన్ని కాంగ్రెస్ కాన్సులర్ అధికారులకు కల్పించిందని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి జాతీయత ఆధారంగా ఇమ్మిగ్రేషన్ వీసాల జారీని నిషేధించే ఈ విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. అర్హులైన దరఖాస్తుదారులకు వీసాలను నిరాకరించాలని ఆదేశించడం ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని వ్యతిరేకించడమే అవుతుందని పేర్కొన్నారు. 75 దేశాల పౌరులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ వీసాలు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ రెండు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, 11 మంది వ్యక్తులు కోర్టులో సవాలు చేశారు. పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జడ్జి జెనెట్ వర్గాస్ విచారణ చేపట్టారు. 75 దేశాల నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం చెల్లదని తీర్పు వెలువరించారు. -
ఒకరి చేతుల్లో ఒకరు ఒరిగిపోయారు..
వాషింగ్టన్ : నిండు నూరేళ్ళు కలిసి బతకాలని.. కలిసే చనిపోవాలని చాలామంది ప్రేమికులు, దంపతులు కలలు కంటారు. అయితే అలాంటి అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. అమెరికాలోని ఓ జంట అలాంటి అరుదైన మరణాన్ని పొందారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఒకరంటే ఒకరికి అభిమానం..ఆ తర్వాత ప్రాణమైన ప్రేమ.. 75 ఏళ్ల వైవాహిక జీవితం..చివరికి మృత్యువులో కూడా తమ బంధం విడిపోకూడదని ఆశించారు. ఒకరి బాహువుల్లో ఒకరు ఒరిగిపోవాలని ఆరాటపడ్డారు. తాము కోరుకున్నట్టుగానే గంటల వ్యవధిలోనే తనువు చాలించి ఆది దంపతులుగా మిగిలిపోయారు. అమెరికాలోని జీన్నత్, (96) అలెగ్జాండర్ (95) జంట మృత్యువులో కూడా తోడు వీడలేదు. భార్య చేతుల్లోనే తుదిశ్వాస విడవాలని భర్త కోరుకుంటే.. నీవెంటే నేను ..నా ప్రాణమా అంటూ భార్య కూడా ప్రాణాలొదిలింది. స్టాన్ఫర్డ్లోని కనెక్టికట్‌కు చెందిన వీరు 1940లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి పిల్లల్ని పెంచి పోషించారు. 75 ఏళ్ల తమ సాహచర్యంలో ఎన్నో అనుభూతులను,అనుభవాలను కలబోసుకున్నారు. కష్టనష్టాలను పంచుకున్నారు. జీవితాంతం ప్రాణంలో ప్రాణంగా బతికిన ఈ జంట తమ ఆఖరి ఘడియలో కూడా తోడునీడై నిలవాలన్న మాటను అక్షరాల అమలు చేశారు. 'తమ ఇంట్లో మంచం మీద ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, ప్రాణాలు వొదలాలని అమ్మానాన్న కలలు కన్నారు. అలాగే వెళ్లిపోయారు' అని కొడుకు రిచర్డ్ తెలిపారు. 'కొన్ని రోజుల కింద నాన్న కింద పడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోయింది. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అమ్మ కూడా అనారోగ్యం పాలైంది. నాన్నకు ఇక నయం కాదని తెలిసి వారి చివరి కోరికను తీర్చాలనకున్నాము. నాన్నను అమ్మ మంచం దగ్గరికి తీసుకొచ్చి......అమ్మకు విషయం చెప్పాను. అంతే అమ్మ, నాన్నను తన చేతుల్లోకి తీసుకొని...నువ్వనుకున్నట్టే జరుగుతోంది.. ఐ లవ్ యూ.. ఆగు,.. నేను కూడా వస్తున్నా.. అంటూ ప్రాణాలు వదిలినట్లు' అలెగ్జాండర్ కూమార్తె యామీ పేర్కొంది. కాగా జూన్ 29వ తేదీన ఈ దంపతుల 75వ వివాహ వార్షికోత్సవం జరగాల్సి వుంది. అయితే దురదృష్టవశాత్తూ వీరిద్దరూ జూన్ 17వ తేదీన గంట వ్యవధిలోనే ఈ లోకాన్ని వీడారు. దీంతో వారి పిల్లలు జూన్ 29న వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ అపురూప దంపతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.


