ఒక్కసారిగా మీ ఉద్యోగం పోయినా ఇతడిలా ఉండాలి.. | Uttar Pradesh born man shares dads reaction layoff | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా మీ ఉద్యోగం పోయినా ఇతడిలా ఉండాలి..

Aug 22 2026 9:28 PM | Updated on Aug 22 2026 9:33 PM

Uttar Pradesh born man shares dads reaction layoff

అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, టెకీకి తన తండ్రి అందించిన అచంచలమైన మద్దతు ధైర్యాన్ని ఇచ్చింది. యూకేలో జేపీ మోర్గాన్ ఉద్యోగం నుంచి తనను తొలగించిన తర్వాత కైష్ అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. అందులో తన తండ్రి తనకు ఓదార్పునిచ్చిన తీరు కనిపించింది.

గతంలో టైలర్‌గా పనిచేసిన తన తండ్రి, తన ఉద్యోగం గురించి కాకుండా ప్రధానంగా తన మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారని చెప్పారు. తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రోత్సహించారని కైష్ అన్సారీ తెలిపారు. “ఈ వీడియోను సానుభూతి కోసం షేర్‌ చేయడం లేదు. కష్టకాలంలో ఉన్న ఎవరికైనా మీరు ఒంటరిగా లేరని గుర్తు చేయడానికే పంచుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది” అని కైష్ అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన విషయంపై కైష్‌ అన్సారీ మాట్లాడుతూ.. “ఉద్యోగం నుంచి తొలగించడం బాధాకరం. మీరు ఎంత అనుభవం ఉన్నవారైనా, ఎంత కష్టపడి పనిచేసినా.. ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే మీపై మీకు, మీ వృత్తిపై, మీ భవిష్యత్తుపై సందేహాలు మొదలవుతాయి” అని రాశారు. కైష్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని డియోరా జిల్లాలోని సలేమ్‌పూర్‌కు చెందినవారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు.

తండ్రి మాటలతో ధైర్యం 
తీవ్రమైన వృత్తిపరమైన ఆత్మన్యూనతకు గురైన సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు తనకు ఎలా ధైర్యం ఇచ్చాయో ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ హృదయాన్ని హత్తుకునే సంభాషణను వివరిస్తూ.. కష్టకాలంలో కుటుంబం తనపై ఉంచే నమ్మకమే అత్యంత గొప్ప ప్రేరణ అని చెప్పారు.

“అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులతో జరిగే ఒక్క సంభాషణ నిజంగా ముఖ్యమైన విషయం ఏమిటో గుర్తు చేస్తుంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత నా నాన్నతో జరిగిన సంభాషణలోని చిన్న భాగం ఇది. నిజాయితీగా చెప్పాలంటే, ఆయన చెప్పిన మాటలు ఆయన ఊహించిన దానికంటే నాకు ఎంతో భాగా అర్థమయ్యాయి. 

నా నాన్న ఎప్పుడూ నాకు అత్యంత గొప్ప ప్రేరణనిచ్చే వ్యక్తుల్లో ఒకరు. ప్రతి విజయంలోనూ, ప్రతి కష్టకాలంలోనూ ఆయనకు నాపై ఉన్న నమ్మకం ఎప్పుడూ మారలేదు. నాపై నాకు సందేహం వచ్చినప్పుడు ముందుకు సాగాలని గుర్తు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు జీవితం అక్కడితో ముగిసిపోదని చెబుతారు” అని కైష్ అన్సారీ తెలిపారు.

సంభాషణను ఎందుకు షేర్‌ చేశారు?
భావోద్వేగానికి లోనైన అన్సారీ స్పందిస్తూ.. “అలాంటి మద్దతును కుటుంబం మాత్రమే ఇవ్వగలదు. ఇదే పరిస్థితిని మౌనంగా ఎదుర్కొంటున్న ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు కాబట్టే దీన్ని పంచుకుంటున్నాను. ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కరణలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు విఫలంకావడం, అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి లేదా ‘ఇక నేను ఏం చేయాలి?’ అని ఆలోచించడం.. వంటి నాకు తెలుసు” అని తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ తిరస్కరణలకు గురవుతున్న వారికి, ఆర్థిక ఆందోళనతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సందేశం ఓదార్పునిస్తుందని ఆయన ఆశించారు.

“వారిలో మీరు ఒకరైతే, దయచేసి గుర్తుంచుకోండి.. ఉద్యోగం కోల్పోవడం మీ విలువకు ప్రతిబింబం కాదు. అది మీ వృత్తిలో జరిగిన ఒక సంఘటన మాత్రమే, మీ వృత్తికి ముగింపు కాదు. ఒక్క ఎదురుదెబ్బ కారణంగా ఇప్పటివరకు మీరు సాధించిన ప్రతిదాన్ని మర్చిపోకండి. నేర్చుకుంటూ ఉండండి. మెరుగుపడుతూ ఉండండి. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూనే ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు. మనం ఇంకా కనుగొనని అవకాశాలు ముందున్నాయి. కొన్నిసార్లు జీవితం ఒక తలుపును మూసివేసి, అంతకంటే మెరుగైన దిశగా మనల్ని నడిపిస్తుంది” అని తెలిపారు.

నాన్న విషయానికి వస్తే… 
తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్సారీ.. “మీ ప్రేమ, మీ మద్దతు, మీ దీవెనలు ఎప్పుడూ ముందుకు సాగేందుకు నాకు బలాన్ని ఇచ్చాయి. నేను ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ నా ఆత్మవిశ్వాసాన్ని, నా ఆశయాన్ని, పోరాడాలనే నా సంకల్పాన్ని కోల్పోలేదు. ఈ ఎదురుదెబ్బను ఎదుర్కొని, మరింత బలంగా తిరిగి వస్తాను. అంతకంటే మంచి ఉద్యోగ అవకాశంతో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను” అని తెలిపారు.

నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన 
తన తండ్రి తన ఉద్యోగం కోల్పోవడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని, తాను ఎలా ఉన్నాననే విషయంపైనే ఎక్కువగా ఆందోళన చెందారని అన్సారీ చెప్పారు. “ఆయన ప్రధానంగా నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. ఎందుకంటే నా కుటుంబానికి పూర్తి బాధ్యత నాదే. 

నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వృత్తిరీత్యా టైలర్. అందుకే నా కుటుంబం కోసం పని ప్రారంభించడానికి నాకు ఇంకా శక్తి ఉందని చెప్పారు. ప్రాథమికంగా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోమని నేను చెప్పాను. ప్రస్తుతం యూకేలో ఉద్యోగ మార్కెట్ కొంత కష్టంగా ఉంది. అయినప్పటికీ నాకు కొన్ని ఉద్యోగ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నాను. త్వరలోనే నాకు మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది” అని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement