షాపింగ్ మాల్‌పై దాడిలో 16కు చేరిన మరణాలు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత క్రీవ్యీ రిహ్ నగరంలోని షాపింగ్ మాల్‌పై జరిపిన భీకర క్షిపణి దాడిలో 16 మంది మృత్యువాతపడగా, 130 మంది వరకు గాయాలయ్యారు. ఇప్పటికీ మరో నలుగురి జాడ తెలియడం లేదని అధికారులు శనివారం తెలిపారు. ఈ దాడిని డబుల్ టాప్ స్ట్రయిక్‌గా జెలెన్‌స్కీ అభివర్ణించారు. లక్ష్యంపై ముందుగా డ్రోన్లతో దాడులు చేయడం, సహాయక సిబ్బంది బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరోసారి భారీ దాడికి పాల్పడటాన్నే డబుల్ ట్రాప్ దాడిగా పేర్కొంటారు.
రష్యా దాడి కారణంగా 9 వేల చదరపు మీటర్ల ప్రాంతం మొత్తం బూడిదగా మారిందని జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉండటాన్ని అదనుగా తీసుకుని రష్యా దాడుల పరంపరను కొనసాగించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు జరిపిన క్షిపణులు, డ్రోన్ల దాడుల్లో మరో ఏడుగురు చనిపోగా, పదుల సంఖ్యలో క్షతగాత్రు లయ్యారు. యుద్ధ క్షేత్రం నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాకు చెందిన సమారాలోని నోవోకుబిషెవ్‌స్క్ ఆయిల్ రిఫైనరీతోపాటు ఓజోన్ కంపెనీ గోదాముపైనా తాము దాడి చేసినట్లు జెలెన్‌స్కీ చెప్పారు.


