దశాబ్దాల కల సాకారానికి రంగం సిద్ధమైంది
ఆరేళ్లలో జాబిల్లిపై శాశ్వత మానవ ఆవాసం రెడీ
గ్రహాంతరాళాల శోధనకు ఇదే నిచ్చెన
నాసా, ఇస్రో, జాక్సా, ఈఎస్‌ఏలు కలిసికట్టుగా రెడీ చేస్తున్న
మూన్‌బేస్ వింతలు విశేషాలు...
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నా సా) జాబిల్లిపై శాశ్వత నివాసం కట్టేందుకు ఉద్దేశించిన ‘మూన్ బేస్’ ప్రాజెక్టులో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భాగస్వామి కానుంది. ఈ రెండు మాత్రమే కాదు యూరోపియన్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేయి కలపనున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే నాసా ఆధ్వర్యంలోని ఆర్టీమిస్–3 ప్రాజెక్టులో భాగంగా 2032 నాటికల్లా మూన్ బేస్ సిద్ధమవుతుందని అంచనా.
ఈ స్థావరం ద్వారా మనకు ఒనగూరే ప్రయోజనాలు, ఏ దేశం ఏ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తికి సాయపడుతుంది? అన్నది ఇక్కడ ఆసక్తికరం. 60, 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలైతే చేస్తున్నారుగానీ భౌతికంగా చందమామను దాటి వెళ్లింది లేదు. కారణాలు అనేకం. అయితే మూన్‌బేస్ ఈ పరిస్థితిని మార్చేస్తుందని అంచనా.
సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి నివసించేందుకు అవకాశమున్న ఏకైక గ్రహం అంగారకుడిపైకి చేరేందుకు మూన్‌బేస్ ఆధారం కానుంది. జాబిల్లిపై దొరికే వనరులను సద్వినియోగం చేసుకునేందుకు, తద్వారా ఎప్పటికైనా అంగారక గ్రహంపై అడుగుపెట్టాలన్నది సంకల్పం. ఇందుకు కావాల్సిన టెక్నాలజీలను పరిశీలించేందుకు మూన్‌బేస్ కీలకం కానుంది.
ఎండ కన్ను పడని చోట...
మూన్‌బేస్‌ను చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఏర్పాటు చేయాలని నాసా నిర్ణయించింది. సూర్యుడి వెలుతురు ఏమాత్రం సోకని ఈ ప్రాంతంలో నీటితోపాటు ఆవాసానికి తగిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయని అంచనా. ఇస్రో 2009లో జరిపిన చంద్రయాన్–1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికి నిర్ధారణ కాగా.. 2019 నాటి చంద్రయాన్–2 ద్వారా అక్కడి ఖనిజాలు, నీటి అణువుల గుర్తింపు కొనసాగుతోంది. చంద్రయాన్–2లోని అత్యాధునిక కెమెరాల పుణ్యమా అని ఇప్పుడు మనకు ఆ ప్రాంతపు అత్యంత స్పష్టమైన ఛాయాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్టెమిస్–3తో షురూ...
2027లో ప్రారంభమయ్యే ఆర్టెమిస్–3 ద్వారా వ్యోమగాములు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగనున్నారు. ల్యాండర్ వ్యవస్థల పరిశీలనతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. తర్వాత 2028–2030 మధ్య మానవ ఆవాసానికి సంబంధించిన మాడ్యూల్స్, విద్యుత్తు సరఫరాకు కావాల్సిన పవర్ గ్రిడ్‌ను ఒక్కొక్కటిగా చంద్రునిపైకి చేరుస్తారు. అవసరాల మేరకు వ్యోమగాములు, సరుకులు రవాణా అవుతూంటాయి.ఆవాస ప్రాంతాల మాడ్యూల్స్ బెలూన్ల మాదిరిగా విచ్చుకునేవిగా ఉంటాయి. వీటితోపాటు అక్కడి రేడియోధార్మికత నుంచి రక్షణ కోసం ప్రత్యేక బంకర్లు, ఆహారం పండించుకునేందుకు గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేస్తారు.
నాలుగు కిలోమీటర్ల గొయ్యిలో...
జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని షాకిల్‌టన్ క్రేటర్ వద్ద మూన్ బేస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 21 కిలోమీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల లోతు ఉండే భారీ లోయ ఈ షాకిల్‌టన్ క్రేటర్. అందువల్ల గొయ్యి అంచుల్లో 24 గంటలూ సూర్యరశ్మి సోకుతూ ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి వెలుతురూ ఉండదు. ఈ సహజ నిర్మాణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు నాసా క్రేటర్ అంచుల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోబోటిక్ రోవర్లు కలిగిన పవర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి సౌరశక్తిని వినియోగించుకుంటారు.
2032 నాటికి సిద్ధం?
ప్రాథమిక అంచనాల ప్రకారం మూన్‌బేస్ నిర్మాణం 2032 నాటికల్లా పూర్తి కావాలి. 2030 నాటికల్లా వ్యోమగాముల ప్రయాణాలు మొదలవుతాయని అంచనా. స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో పరిశోధనశాలలు, ఇతర వాణిజ్య ఏర్పాట్లు చేస్తారు. జాబిల్లిపై దొరికే నీరు, మట్టి నుంచి అవసరమైన ఇంధన వనరులు (హీలియం, ఆక్సిజన్ వంటివి) వెలికితీసే ఇన్–సిటు రిసోర్స్ యూటిలైజేషన్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లాలంటే భూమి పై నుంచి రాకెట్ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి విడిపోయినట్లు అంచనాలున్న జాబిల్లిని విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారా భూ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు కొన్ని అంశాలు కలిసి రావాలి. మొదటిది అంతర్జాతీయ సహకారం. రెండోది ఆర్థిక వనరులు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కిలోగ్రాము బరువును జాబిల్లిపైకి చేర్చేందుకు భారీస్థాయిలో ఖర్చు అవుతుంది. అలాంటిది టన్నులకు టన్నులు అక్కడికి పంపించాలంటే అవసరమైన నిధులు సేకరించడం ఎలా అన్నది ప్రశ్న.
–సాక్షి, నేషనల్ డెస్క్


