ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు
ఒంగోలు టౌన్: త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల లొకేషన్లు, పోలింగ్ బూత్‌లు సందర్శించాలన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో రానున్న ఎన్నికలపై సమీక్షించారు. దర్యాప్తులో ఉన్న హత్య, పోక్సో, ప్రాపర్టీ నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. పాత ముద్దాయిలను బైండోవర్ చేయాలని, తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో మార్కాపురం ఓఎస్‌డీ శ్రీనవజ్యోతి మిశ్రా, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) యుగంధర్ బాబు, అడిషనల్ ఎస్పీ (క్రైం) సీహెచ్ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, శ్రీధర్ బాబు, బాలమురళీ కృష్ణ, నాగరాజు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


