సాగు నీరివ్వని సర్కారుపై రైతుల ఆగ్రహం | Farmers are angry on the government for not providing irrigation water | Sakshi
Sakshi News home page

సాగు నీరివ్వని సర్కారుపై రైతుల ఆగ్రహం

Aug 23 2026 5:10 AM | Updated on Aug 23 2026 5:10 AM

Farmers are angry on the government for not providing irrigation water

హెచ్చెల్సీ ఆయకట్టుకు వెంటనే నీరివ్వాలని డిమాండ్‌ 

కర్ణాటకలో నీరిస్తున్నా, ఇక్కడ ఇవ్వబోమని చెప్పడంపై మండిపాటు 

గుండ్లపల్లి క్రాస్‌–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై వందలాది రైతుల భారీ ధర్నా 

29 నుంచి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిక 

కణేకల్లు: సాగు నీరివ్వని చంద్రబాబు ప్రభుత్వంపై అనంతపురం జిల్లాలోని హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు తిరగబడ్డారు. కణేకల్లు, బొమ్మనహళ్, డి.హీరేహళ్‌ మండలాల్లోని హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీటి కోసం ఆందోళనలు, హెచ్చెల్సీ కార్యాలయాల ముట్టడి చేసినా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు శనివారం గుండ్లపల్లిక్రాస్‌–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ఎత్తున ధర్నా చేశారు. టీబీ డ్యామ్‌లో నీరు భారీగా చేరుతున్నా నీరు వదలకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పొరుగున ఉన్న కర్ణాటకలో ఇదే హెచ్చెల్సీ కింద నీరు విడుదల చేసింది. 

అనంతపురం జిల్లాలో మాత్రం సాగు నీరు ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే వరినారు పోసుకుని నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వందలాది రైతులు గుండ్లపల్లిక్రాస్‌–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ధర్నా చేశారు. 

ఈ నెల 29 లోపు నీరివ్వకపోతే కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌ డివిజన్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడతామని మెట్టు గోవిందరెడ్డి హెచ్చరించారు. కణేకల్లు క్రాస్‌లో జరిగే నారా లోకేశ్‌ సభను అడ్డుకుంటామన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగింది. ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో వారికి, మెట్టు గోవిందరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement