సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేదేలే.. | Andhra Pradesh: Junior doctors intensify protest | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేదేలే..

Aug 23 2026 5:23 AM | Updated on Aug 23 2026 5:23 AM

Andhra Pradesh: Junior doctors intensify protest

జూనియర్‌ డాక్టర్ల ఉద్యమం ఉధృతం 

13వ రోజూ కొనసాగిన సమ్మె 

అన్ని సేవలూ బహిష్కరణ  


 

సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడతూర్పు)/మహారాణిపేట: రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్ల (జూడాలు) ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. జూడాల సమ్మె 13వ రోజు శనివారం కూడా కొనసాగింది. స్టైపెండ్‌ 20 శాతం పెంచాలని జూడాలు డిమాండ్‌ చేయగా, ఏడాదికి 3 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి తాము అంగీకరించబోమని శుక్రవారం ఏపీ జూడా అసోసియేషన్‌ తేల్చి చెప్పింది. ప్రభుత్వం తమ సమస్యలన్నీ పరిష్కరించే వరకు సమ్మె ఆపబోమని అల్టిమేటం ఇచి్చంది. ఈ నేపథ్యంలో శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రుల్లో వైద్యసేవలు స్తంభించిపోయాయి. 

దాదాపు 8 వేల మంది జూడాలు వైద్యసేవలు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకేసారి 8 వేల మంది సేవలకు దూరం కాగా, వారి స్థానంలో కేవలం 500 మందిలోపు వైద్యులను బయటి నుంచి సర్దుబాబు చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. దీంతో రోగుల అవసరాలకు సరిపడా వైద్యులు లేక అన్ని జీజీహెచ్‌లలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓపీ, ఐపీ, డెలివరీలు, సర్జరీలు, ఇలా అన్ని రకాల సేవలు రోజురోజుకూ పతనం అవుతున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం జూడాల సమ్మె వల్ల వైద్యసేవలపై ఎక్కడా ప్రభావం లేదని కల్ల»ొల్లి మాటలతో కాలక్షేపం చేస్తోంది.   

కళ్లకు గంతలతో జూనియర్‌ వైద్యుల నిరసన 
విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో జూనియర్‌ వైద్యులు శనివారం కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. కేజీహెచ్‌ నుంచి ఆంధ్రా మెడికల్‌ కళాశాల మీదుగా ర్యాలీ నిర్వహించి తిరిగి కేజీహెచ్‌కు చేరుకున్నారు. అనంతరం మానవహారం చేపట్టి నినాదాలు చేశారు.  

తక్షణమే దృష్టి సారించండి  
జూనియర్‌ డాక్టర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రమణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. జూడాల సమ్మె వల్ల బోధనాస్పత్రుల్లో రోగుల సంరక్షణ గాడి తప్పిందని ఆందోళన వ్యక్తంచేశారు. విపరీతమైన రోగుల రద్దీ ఉన్నచోట సరిపడా వైద్యులు లేరని తెలిపారు. వెంటనే సమ్మెను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement