పాత గుంటూరు సీఐ తీరుతో యువకుడి ఆత్మహత్యాయత్నం
తన తల్లి ఆత్మహత్యకు యత్నించినా కేసు నమోదు చేయలేదని ఆరోపణ
తన చావుకు సీఐ, ఎస్‌ఐ కారణమంటూ సెల్ఫీ వీడియో
పట్నంబజారు (గుంటూరు): ‘మా అమ్మను, నన్ను సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. మనస్తాపంతో మా అమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ) కూడా అయినా పాతగుంటూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కట్టడంలేదు. సీఐ, ఎస్‌ఐని కాళ్లావేళ్లా పడ్డా కనీసం పట్టించుకోలేదు. మా అమ్మ చావుబతుకుల్లో ఉందని చెబితే.. మీ అమ్మ చస్తే.. చూద్దాంలే అని సీఐ వ్యాఖ్యానించారు’.. అని పాత గుంటూరుకు చెందిన షేక్ బాజీబాబావలి ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మృతికి పాత గుంటూరు సీఐ, ఎస్‌ఐ మరికొందరు కారణమని చెబుతూ తీసుకున్న సెల్ఫీ వీడియోలో పలు ఆరోపణలు చేశాడు. ఆ వివరాలు..
పాత గుంటూరులో నివాసం ఉండే షేక్ సైదాబీ కుమారుడు షేక్ బాజీబాబావలి కొత్తపేటలో ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గుజ్జనగుండ్లకు చెందిన ఒక యువతితో బాజీబాబావలికి కొద్దిరోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. అయితే, వివాహం చేసుకోవాలనుకున్న అమ్మాయి మానసికంగా సరిగ్గాలేదని తెలుసుకుని వివాహ నిర్ణయాన్ని రద్దుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు బాజీబాబావలి దుకాణంపై దాడిచేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
దీనిపై ఇరుపక్షాలు కొత్తపేట పోలీసుస్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఇది తట్టుకోలేక తన తల్లి మానసిక ఆందోళనతో గత నెలలో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిందని బాజీబాబావలి వాపోయాడు. ఈ ఎంఎల్‌సీ కేసుకు సంబంధించి పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు వెళ్తే సీఐ కె. వెంకటప్రసాద్, ఎస్‌ఐ పట్టించుకోవడంలేదని, నెలరోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవటంలేదని ఆరోపించాడు.
సీఐ హేళనగా మాట్లాడారు..
ఈ క్రమంలో.. శనివారం మళ్లీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి సీఐని అడగ్గా.. ‘మీ అమ్మ చస్తే అప్పుడు చూద్దాంలే’.. అంటూ హేళనగా మాట్లాడారని షేక్ బాజీబాబావలి ఆ వీడియోలో ఆవేదన వ్యక్తంచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఇంట్లోనే మత్తు బిళ్ళలు మింగానని కన్నీరుమున్నీరయ్యాడు. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలున్నాయని, వాటిని తొలగించాలని పోలీసులను అడుగుతున్పప్పటికీ పట్టించుకోవటంలేదని వివరించాడు.
ఎంఎల్‌సీ ఇస్తే తాము ప్రైవేట్ కంప్లయింట్ చేసుకుంటామని చెబుతున్నప్పటీకీ సీఐ, ఎస్‌ఐ, రైటర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పాడు. తన చావుకు పోలీసులతో పాటు, తాను పెళ్లి సంబంధం మాట్లాడుకున్న పలువురు మహిళలు కూడా కారణమని తెలిపాడు. బాబావలి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి వర్గాల సమాచారం.


