సాక్షి టాస్క్ ఫోర్స్ : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే వీఎం థామస్ చెన్నైలో నిర్వహిస్తున్న ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తునుంచి దూకి శ్వేతాఘోష్ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే వీఎం థామస్ కొన్నేళ్లుగా చెన్నైలోని అమీంజికర్ నెల్సన్ మాణిక్యం రోడ్డులో చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) పేరిట ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో కోల్‌కతాకి చెందిన శ్వేతాఘోష్ పనిచేస్తోంది. ఆమె ఈ నెల 13న 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది.
యాజమాన్యం హుటాహుటిన ఆమెను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ నెల 20న మెరుగైన వైద్యం కోసం మీడియా కంటపడకుండా తిరుపతిలోని అమర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21న (శుక్రవారం) రాత్రి శ్వేతాఘోష్ మృతి చెందింది. ఈ ఘటనపై చెన్నై అమీంజకర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎఫ్‌సీకి చెన్నైలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా బ్రాంచీలు ఉన్నాయి.
వేధింపులు భరించలేకే..
శ్వేతాఘోష్ ఏడేళ్లుగా సీఎఫ్‌సీలో పశ్చిమ బెంగాల్‌తోపాటు బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి ఐవీఎఫ్ కోసం వచ్చే వారి కోసం ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తోంది. కాగా.. ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ ఐవీఎఫ్ చికిత్స కోసం సీఎఫ్‌సీలో చేరారు. ఫీజులు, బిల్లింగ్ వివరాలను ఆ మహిళకు వివరించే సమయంలో శ్వేతఘోష్ వైపు కమ్యూనికేషన్ లోపం జరిగిందనే ఉద్దేశంతో ఆస్పత్రి మేనేజర్లు ఆంటోని, బాలు ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శ్వేతాఘోష్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకేసినట్లు సమాచారం.

శ్వేతాఘోష్ మృతిపై అనుమానంతో ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీతో పాటు సంబంధిత రికార్డులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సీఎఫ్‌సీలో సిబ్బందికి వేధింపులు, కాన్పులకు వచ్చే మహిళల నుంచి అధిక మొత్తంలో డిమాండ్ చేయడం, కాన్పు సమయంలో సరైన వైద్యం అందించక పురిటి నొప్పులతో ఇతర ఆస్పత్రులకు వెళ్లి కాన్పులు చేయించుకోవడం, రక్తపు మడుగులో పడి ఉన్నా బాలింతలని కూడా చూడకుండా ఆస్పత్రి యాజమాన్యం వేధిస్తున్నారని చెన్నైలోను, చిత్తూరు జిల్లాలోను ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగదు చెల్లించినా యాజమాన్యం పెట్టే వేధింపులను తాళలేక బాలింతలు, సిబ్బంది ఆత్మహత్యలే శరణ్యమని తనువు చాలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


