ఖమ్మం.. క్లీన్‌ అప్‌ | Artificial intelligence surveillance on road cleanliness in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం.. క్లీన్‌ అప్‌

Aug 23 2026 6:11 AM | Updated on Aug 23 2026 6:11 AM

Artificial intelligence surveillance on road cleanliness in Khammam

చెత్తకు చెక్‌ పెట్టేలా దేశంలోనే తొలిసారి యాప్‌ వినియోగం 

కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ ఆలోచనల నుంచి అంకురార్పణ

ఫొటో ఆధారంగా పరిశుభ్రతను నిర్ధారించనున్న సాంకేతికత

రోడ్ల పరిశుభ్రతపై కృత్రిమమేధ నిఘా

రోడ్ల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేఎంసీ) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పాలన, పర్యవేక్షణ, పౌర సేవల్లో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విపత్తులు, వరదల సమర్థ నిర్వహణకు కేఎంసీ సాంకేతికతను వాడుతోంది. వీధులను నిత్యం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య ‘ఖమ్మం–క్లీన్‌ అప్‌’పేరుతో ఒక యాప్‌ రూపొందించారు. దేశంలోనే ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ లేనివిధంగా తొలిసారి ఖమ్మంలోనే ఏఐ ఆధారిత యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) మాస్టర్‌ ప్లాన్‌ మ్యాప్‌ ఆధారంగా నగరంలోని ప్రతి వీధిని డిజిటలైజ్‌ చేశారు. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత వీధులతో కలిపి మొత్తం 3,271 రోడ్లను యాప్‌లో పొందుపరిచారు. సాధారణంగా నగరంలో రోజు విడిచి రోజు రోడ్లను ఊడ్చి శుభ్రం చేస్తారు. కానీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ లోపం, జవాన్ల అలసత్వంతో చాలాచోట్ల వారాల తరబడి అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన యాప్‌ ఆధారంగా ఏ రోడ్డు ఎన్ని రోజులకు ఓసారి శుభ్రమవుతుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు.

జెమిని ఏఐతో పక్కా నిఘా..: జవాన్లు అప్‌లోడ్‌ చేసే ఫొటోలు నిజమైనవో కాదో నిర్ధారించేందుకు ఈ యాప్‌ను జెమిని ఏఐ సాంకేతికతతో అనుసంధానించారు. ఇది 70 శాతానికి పైగా కచ్చితత్వంతో ఫలితాలను విశ్లేషిస్తుంది. ఫొటోలో రోడ్డుపై ఏ మాత్రం చెత్త ఉన్నట్టు చూపించినా ఏఐ గుర్తిస్తుంది. ప్రస్తుతం పది మంది జవాన్లతో యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల 29 రోడ్ల ఫొటోలను అప్‌లోడ్‌ చేయగా, జెమిని ఏఐ ఎనిమిది రోడ్లు శుభ్రంగా ఉన్నాయని.. మరో నాలుగు రోడ్లపై పని జరుగుతున్నట్టు గుర్తించింది. మిగతా 17 ఫొటోల్లో రోడ్లు సరిగా శుభ్రం కాకపోవడంతో వాటిని తిరస్కరించింది. త్వరలోనే జవాన్లకు ప్రత్యేక లాగిన్‌ కేటాయించి యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు. మాస్టర్‌ ప్లాన్‌లో లేని రోడ్లను కూడా యాప్‌లో చేర్చాలని కమిషనర్‌ ఆదేశించారు.

రంగుల ఆధారంగా గుర్తింపు
ఎరుపు రంగు: శుభ్రం చేయాల్సిన రోడ్లు ఈ రంగులో కనిపిస్తాయి.
పసుపు రంగు: పని ప్రారంభించి జవాన్‌ ఫొటో అప్‌లోడ్‌ చేయగానే యాక్టివ్‌గా ఉన్నట్టు చూపుతుంది.
ఆకుపచ్చ రంగు: రోడ్డు పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన తర్వాత గ్రీన్‌ మార్క్‌లోకి మారుతుంది. (ఇది 48 గంటల పాటు అలాగే ఉండి ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మళ్లీ ఎరుపు రంగులోకి మారుతుంది).
నలుపు రంగు: రోడ్డు సరిగా శుభ్రం కాకపోయినా, చెత్త కనిపించినా యాప్‌ ఆ ఫొటోను తిరస్కరించి నలుపు రంగులోకి మారుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement