వీఎల్‌టీడీ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ | Vehicle Location Tracking mandatory for transport vehicles | Sakshi
Sakshi News home page

వీఎల్‌టీడీ ఉంటేనే రిజిస్ట్రేషన్‌

Aug 23 2026 6:06 AM | Updated on Aug 23 2026 6:06 AM

Vehicle Location Tracking mandatory for transport vehicles

రవాణా వాహనాలకు వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ తప్పనిసరి

ఎలాంటి మినహాయింపు లేదని కేంద్రం స్పష్టీకరణ

ఈ మేరకు వాహన్‌ పోర్టల్‌లో మార్పు 

ప్రయాణికులు, విద్యార్థుల భద్రతకు పటిష్ట చర్యలు

ఇక బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, క్యాబ్‌లు, తదితర రవాణా వాహనాలకు వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ (వీఎల్‌టీడీ) తప్ప­నిసరి. ప్రయాణికులు, స్కూల్‌ పిల్లల భద్రత దృష్ట్యా ప్రతీ వాహనానికి ఈ పరికరం ఉండాల్సిందే. రహదారి భద్రతా చట్టం మేరకు వీఎల్‌టీడీ పరికరాలు ఉన్న వాహనాలు మాత్రమే ఆర్టీఏలో నమోదవుతాయి. ఈ మేరకు రవాణాశాఖ ప్రవేశపెట్టిన ‘వాహన్‌ పోర్టల్‌’లో తగిన మార్పు చేసినట్లు సమాచారం. వీఎల్‌టీడీ ఏర్పాటుపై ఎలాంటి మినహాయింపులు లేవని, గడువు పొడిగించే అవకాశం కూడా లేదని కేంద్ర రవాణాశాఖ తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. 

దీంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణ­లోని రవాణా కార్యాలయాల్లో కొత్తగా నమోదయ్యే ప్రతీ వాహనానికి ఈ డివైజ్‌ను అమర్చవలసి ఉంటుంది. ఇప్పటికే అన్ని రకాల వ్యక్తిగత వాహనాలకు షోరూమ్‌లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ సదుపా­యం కొనసాగుతుండగా, కొద్దిరోజుల క్రితం బస్సులు, లారీలు, క్యాబ్‌లు, ఆటోలు వంటి అన్ని రవాణా వాహనాలకు షోరూమ్‌ రిజిస్ట్రేషన్‌లను ఖైరతాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నా­రు. త్వరలో అన్ని ఆర్టీఏ కార్యాలయాలకూ విస్తరించను­న్నారు. దీంతో వీఎల్‌టీడీ కలిగిన వాహనాలనే నమోదు చేసేలా వాహన్‌ పోర్టల్‌ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు రవాణా అధికారి ఒకరు తెలిపారు.

భద్రత పటిష్టం
ఏఐఎస్‌–140 ప్రమాణాలతో రూపొందించిన వీఎల్‌టీడీ డివైజ్‌లను మాత్రమే వినియోగించేలా వాహన్‌ పోర్టల్‌లో మార్పులు చేశారు. ఈ డివైజ్‌లను విక్రయించే వారినీ కేంద్రం ఇప్పటికే గుర్తించి వివరాలను పోర్టల్‌లో నమోదు చేసింది. ఈ డివైజ్‌లలో ప్యానిక్‌ బటన్, ఎస్‌ఓఎస్‌ సిస్టమ్‌ ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, విపత్కరమైన ప్రతికూల పరిస్థితులు వంటివి ఎదురైనప్పుడు పోలీస్, రవాణా వర్గాలను అప్రమత్తం చేసేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుంది. 

24 గంటలపాటు వాహనాలను ట్రాకింగ్‌ చేసే వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. మహిళా ప్రయాణికులు తమ భద్రత కోసం ఎస్‌ఓఎస్‌ వంటి ప్యానిక్‌ బటన్‌ నొక్కి పోలీస్‌ సహాయాన్ని కోరవచ్చు. ఈ మేరకు రవాణా కమిషనర్, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ట్రాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఈ డివైజ్‌ల నుంచి మినహాయింపును కోరుతూ రవాణా అధికారులు కొంతకాలం గడువును కోరారు. కానీ కేంద్రం అందుకు నిరాకరించి తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

వీఎల్‌టీడీ ఉంటేనే పర్మిట్లు
ఆలిండియా పర్మిట్లపై తిరిగే అన్ని బస్సులు, రవాణా వాహనాలకు వీఎల్‌టీడీ ఉంటేనే పర్మిట్లు లభిస్తాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ పరికరాలు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. వీఎల్‌టీడీ ఉన్న వాహనాలకు మాత్రమే వాహన్‌ పోర్టల్‌ నుంచి గుర్తింపు లభిస్తుంది. ఈ పరికరాలు లేకుండా అన్ని రకాలుగా ఫిట్‌నెస్‌ ఉన్నప్పటికీ రవా­ణాశాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు లభించవు. స్కూల్‌ బస్సుల్లోనూ ఇవి తప్పకుండా ఉండాలి. ‘ఇక నుంచి వీఎల్‌టీడీ ఉన్న కొత్త వాహనాలు మాత్రమే నమోదవు­తాయి. అలాగే ఈ డివైజ్‌లు ఉంటేనే పాతవాటికి పర్మిట్లు లభిస్తాయి. ఇందుకనుగుణంగా త్వరలో మార్పులు అమల్లోకి రానున్నాయి’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement