నేడు రేవంత్‌ రాక.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై బిగ్‌ సస్పెన్స్‌! | Konda Family Row Escalates In Telangana Congress As Party Leadership Weighs Disciplinary Action, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నేడు రేవంత్‌ రాక.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌పై బిగ్‌ సస్పెన్స్‌!

Aug 23 2026 9:24 AM | Updated on Aug 23 2026 1:50 PM

Political Suspense On Telangana Congress Konda Surekha Family Episode

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్‌ ఎపిసోడ్‌లా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. సొంత పార్టీ నేతలే తనపై విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది. 

కొండా సురేఖ, కొండా మురళి వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ మరోసారి ఈ అంశాన్ని చర్చించనుంది. తదుపరి సమావేశంలో కొండా వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

మరోసారి లేఖాస్త్రం..
తనపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న తనపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శల విషయంలో పార్టీ నాయకత్వం స్పందించాలని ఆమె కోరినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: కొండా సురేఖపై చర్యలు.. కాంగ్రెస్‌లో తర్జనభర్జన

కొండాపై గరం..
మరోవైపు కొండా కుటుంబం తీరుపై కాంగ్రెస్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కొండా కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తుండగా.. మరికొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అల్టిమేటం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది.

సీఎం రాగానే కీలక పరిణామాలు?
ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి లండన్‌ పర్యటనలో ఉండగా.. నేడు రాత్రి ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సీఎం రాకతో కొండా వ్యవహారంపై కాంగ్రెస్‌ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో.. సీఎం సమక్షంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు.. ఇలా కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌ ఉత్కంఠ రేపుతోంది. క్షమాపణ చెబుతారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చగా మారింది. సీఎం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్‌ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement