నేడు ప్రపంచ వడాపావ్ రోజు
‘ఇండియన్ బర్గర్’గా, ‘బాంబే బర్గర్’గా పేరుపొందిన ‘వడాపావ్’ పుట్టి నేటికి అరవయ్యేళ్లవుతోంది. ముంబైలో పుట్టిన ఈ సత్వరాహార పదార్థం అనతి కాలంలోనే ముంబై ప్రజల ఆహార సంస్కృతిలో భాగంగా మారింది. అంతటితోనే ఆగిపోకుండా, శరవేగంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. అసలు వడాపావ్ ఆవిష్కరణే ఒక ఆసక్తికరమైన చరిత్ర.
అవసరమే ఆవిష్కరణకు పునాది
ఎటు చూసినా, నిరంతర జనసమ్మర్దంతో కిటకిటలాడే మహానగరం ముంబై. అరవయ్యేళ్ల కిందట ముంబై కార్మికవర్గం ఎక్కువగా ఉదయం చపాతీలు తినేవారు. చపాతీలతో పాటు ఉడికించిన బంగాళ దుంపలను ముద్దలా చిదిమేసి, కాస్త వేయించి, మసాలాలు కలిపిన కూరను నంజుకునేవారు. హడావుడి పనివేళల్లో వీటిని తినడం కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముంబై నడిబొడ్డులోని దాదర్ ప్రాంతానికి చెందిన అశోక్ వైద్య అనే పాకనిపుణుడు 1966లో ‘వడాపావ్’ను ఆవిష్కరించాడు.
బన్ రొట్టెను అడ్డంగా చీల్చి, అందులో మసాలాలు దట్టించి, వేపిన బంగాళదుంపల ముద్దను కూరి, నంజుకోవడానికి వేపిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి చేర్చిన కొబ్బరి చట్నీతో పాటు వడ్డించడం మొదలుపెట్టాడు. ఎక్కడైనా తినడానికి సులువుగా ఉండటమే కాకుండా, అతి రుచిగా ఉండటంతో వడపావ్ ముంబై జనాలను ఆకట్టుకుంది. అశోక్ వైద్య దాదర్ రైల్వేస్టేషన్ ఎదుట తన వడాపావ్ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. డెబ్బయిల ప్రారంభంలోనే ఇలాంటి స్టాల్స్ పదుల సంఖ్యలో ముంబై నలుమూలలా ఏర్పడ్డాయి. ప్రస్తుతం కేవలం ముంబై నగరంలోనే ఏకంగా ఇరవైవేలకు పైగా వడాపావ్ స్టాల్స్ ఉన్నాయి. వీటికి తోడు స్టార్ హోటళ్లు కూడా వడాపావ్‌ను వడ్డిస్తున్నాయి. తొంభైల నాటికి దేశంలోని ప్రధాన నగరాలన్నింటితో పాటు విదేశాల్లోని భారతీయ రెస్టరెంట్లకు కూడా వడాపావ్ విస్తరించింది.
వడాపావ్ ఒక సాంస్కృతిక ప్రతీక
ఒకప్పుడు ముంబైలో ఎక్కువగా ఉడుపి హోటళ్లు ఉండేవి. ముంబై కార్మికుల్లో ఎక్కువమంది కాటన్ మిల్లుల్లో పనిచేసేవారు. అరవైల కాలంలో కాటన్ మిల్లులు మూతపడటంతో చాలామంది కార్మికులు ఉపాధి పోగొట్టుకున్నారు. అప్పటి శివసేన అధినేత బాల్ ఠాక్రే స్థానికంగా చిరువ్యాపారాలు సొంతగా ప్రారంభించి, ముంబై కార్మికులు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే అశోక్ వైద్య వడాపావ్‌ను ఆవిష్కరించి, సొంత వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపార విజయం స్ఫూర్తితో మరింతమంది ఈ రంగంలోకి వచ్చారు. వడాపావ్ ప్రపంచవ్యాప్తంగా ఉనికి చాటుకోవడంతో దీని గౌరవార్థం ఏటా ఆగస్టు 23న ‘ప్రపంచ వడపావ్ రోజు’గా జరుపుకోవడాన్ని 2001 నుంచి ప్రారంభించారు.


