వినోదం కొత్త అడ్రస్ కు షిఫ్ట్ అయ్యింది
మనిషి పుట్టినప్పటి నుంచి వినోదం ఉంది. మాటల్లోనూ, బొమ్మల్లోనూ, గోడమీద గీతల్లోనూ, కాగితపు రాతల్లోనూ మనిషిలోని చిలిపితనం తాలూకు చమక్కులు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. నాగరికతలు అభివృద్ధి దిశగా పయనం మొదలుపెట్టినప్పుడు వినోదం రంగస్థలమంటూ మన చుట్టూ కాస్త స్థలాన్ని సంపాదించుకుంది. దాని తర్వాత సాంకేతికత పల్లకినెక్కిన వినోదం – మొదట మూకీగా, తర్వాత టాకీగా సినిమాలు తెరకెక్కి, బాక్సాఫీసు లెక్కలంటూ అంకెలు చూపించి రంకెలు వేసింది. ఆ తర్వాత టీవీ పెట్టెలో బుల్లితెర మనింటి బంధువై, పొరుగింటి చుట్టమై మనతో కలసిపోయి ఓ వెలుగు వెలిగింది.
అక్కడితో ఊరుకుందా? జెన్ జీలతోనే పోటీ పడుతూ కాలంతో పాటు వినోదం కూడా వేగమందుకుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా అంటూ యమస్పీడు పెంచింది. ఇప్పుడు మైక్రోడ్రామా (చిట్టి కథ) అంటూ మరో మెట్టుకెక్కింది. ఒకప్పుడు మనల్ని వెండితెర వింతలు చూపించి అబ్బురపరిస్తే, దాని వెనుక వచ్చిన బుల్లితెర సందడులెన్నో మోసుకొచ్చి సంబరపరచింది. కాని ఇది వెండితెర యుగం కాదు బుల్లితెర యుగం కాదు ఇది వేళ్లతెర (టచ్ ఫోన్) యుగం. వర్చువల్ వరల్డ్‌లో వినోదానికి కొత్త ప్లాట్‌ఫాం ఈ వర్టికల్ వరల్డ్. వెల్‌కమ్ టు మైక్రో‘డ్రామేనియా!’
ఎమోషనల్ టచ్
టర్‌టెయిన్‌మెంట్... మాటలురాని చంటి పిల్లవాడి నుంచి మంచంపట్టిన నానమ్మ, తాతయ్యల వరకు అందరికీ అవసరమైనది ఇదే... నచ్చిన సినిమా కోసం డబ్బులు పోగేసుకుని థియేటర్‌కి వెళ్లి చూస్తారు. రోజుకోసారి వచ్చే సీరియల్ కోసం రోజంతా వెయిట్ చేస్తారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంటర్‌టెయిన్‌మెంట్ గేర్ మార్చింది. రిమోట్ పట్టుకుని చానల్స్ మార్చే చేయి ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తోంది.
హాలీవుడ్ స్టార్ సినిమా విశేషాల దగ్గర నుంచి లోకల్ గ్యాంగ్æటాలెంట్ వరకు కాదేదీ రీల్స్‌కి అనర్హం అంటూ పుంఖానుపుంఖాలుగా లెక్కకు మించి ఇన్‌బాక్స్‌లోకొచ్చి పడుతున్నాయి. ఈ రీల్స్ ట్రెండ్ పరిధిని పెంచుతూ మైక్రోడ్రామా సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగాన్ని ఉర్రూతలూపుతున్నాయి. ఒక్కో మైక్రో డ్రామా ఎపిసోడ్ నిడివి ఒకటి నుంచి మూడు నిమిషాల వరకు ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ భావోద్వేగాలను తారస్థాయిలో చూపిస్తారు. మైక్రోడ్రామాలకి ఇదే ఆయువుపట్టు. ఈ చిట్టి కథలు 60 నుంచి 100 ఎపిసోడ్ల వరకు ఉంటాయి. అంటే ఇంచుమించు సినిమా నిడివికి సమానం..
ఎలా మొదలైందంటే!
కోట్లాది వీక్షకులు చూస్తున్న మైక్రోడ్రామా చైనాలో పురుడు పోసుకుంది. 2018లో డౌయిన్ (ప్రస్తుతం చైనా టిక్‌టాక్ వర్షన్) తొలుత షార్ట్ వర్టికల్ వీడియోలు రిలీజై యూత్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 2019లో ‘డ్వాన్‌జు’ పేరుతో మొదటి కమర్షియల్ మైక్రో డ్రామాలు విడుదలయ్యాయి. 2020 కరోనా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచి అటు వెండితెరకు, ఇటు బుల్లితెరకు ప్రత్యామ్నాయంగా మారి అనతికాలంలోనే విస్తరించాయి. అలా కేవలం మూడేళ్లలోనే చైనావాల్ దాటి ప్రపంచ కాంపౌండ్‌లోకి దూకాయి.
కమింగ్ టు అమెరికా... (2022 –2024)
చైనాలో మైక్రోడ్రామాల ఫార్మాట్ హాలీవుడ్‌ను కూడా ఆకర్షించింది. పాశ్చాత్య ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా టేకింగ్, అందుకు అనుగుణంగా బడ్జెట్‌లు మారాయి. కథల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. బిలియనీర్ రొమాన్స్, మాఫియా రొమాన్స్, క్యాంపస్ రొమాన్స్ వంటి కథలు వచ్చాయి. విడుదలైన ప్రతి మైక్రో సిరీస్‌కు అనూహ్యంగా ప్రేక్షకుల నుంచి స్పందన రావడంతో హాలీవుడ్ పరిశ్రమ కూడా ఈ ఫార్మాట్‌ను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టింది.
జపాన్ వయా కొరియా (2024)
ఈ చిట్టికథలు సృష్టించిన సునామీ సౌత్ కొరియా, జపాన్ తీరాలను తాకింది. రొమాంటిక్ కామెడీ, ఐడియల్ డ్రామా, ఫాంటసీ డ్రామా, రొమాన్స్ జానర్లలో కొరియన్ డ్రామాలు ఆ దేశంలోనే కాదు విదేశాలలో కూడా ‘కె–డ్రామా’ పేరిట ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ముఖ్యంగా క్వాలిటీ విషయంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి సిరీస్‌ను మలచడంతో అనతికాలంలో కె–డ్రామాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక జపాన్‌లో అయితే వారి సంస్కృతిలో భాగమైన యానిమి, మాంగా కథలను చిట్టికథల్లోకి ప్రవేశపెట్టారు. అలాగే స్లైస్ ఆఫ్ లైఫ్, స్కూల్ రొమాన్స్ సీరిస్ వంటి జానర్లలో మైక్రో సిరీస్‌లను రూపొందించడంతో అవి కూడా విశేషాదరణ పొందాయి.
మన దేశంలోకిలా.. (2024 –2026)
భారత్‌లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించిన చిట్టికథల ట్రెండ్ గట్టిగానే సౌండ్ చేస్తోంది. మధ్య తరగతి కుటుంబ నేపథ్యం, బాధ్యతలు, రాజు–పేద తారతమ్యం, కాలేజ్ లవ్ వంటి జానర్ల మీద ప్రధానంగా మైక్రోడ్రామాలు రూపొందుతున్నాయి. అయితే భారత్‌లో ఇంకా ఈ ఫార్మాట్ ప్రారంభ« దశలోనే ఉందని చెప్పాలి. అంటే దాని అర్థం ఈ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయనే! చౌక అయిన మొబైల్ డేటా, పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, ప్రాంతీయ భాషలలో డబ్బింగ్‌కు పెరుగుతున్న డిమాండ్, అధిక జనాభా మొబైల్ వాడకం ఇవన్నీ మనదేశంలో మైక్రోడ్రామా పరిశ్రమ అభివృద్ధికి ఊతమిచ్చేలా సంకేతాలిస్తున్నాయి.
రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మూడు గంటల సినిమా నిర్మించడానికి నెలల తరబడి ప్రీ–ప్రొడక్షన్, భారీ సెట్లు, హీరో, హీరోయిన్ల డేట్లు, కోట్ల రూపాయల ఖర్చు అవసరమవుతుంది. ఇంతా చేసి సినిమా హిట్ అయ్యిందా సరే, లేదంటే నిర్మాత కోట్ల నష్టాలు మూట గట్టుకోవాలి. కాని మైక్రో డ్రామాల్లో మాత్రం ఇంత ఖర్చు అక్కర్లేదు. కోట్లకు కోట్లు కుమ్మరించాల్సిన పని లేదు. డేట్ల కోసం హీరోల వెంట పడక్కర్లేదు. మంచి కథ ఎంచుకుని చిన్న బడ్జెట్‌తో పరిమితమైన లొకేషన్లలో కొత్తవారితోనే సీరిస్ తీసేయవచ్చు. ఇక్కడ చిన్న బడ్జెట్ అంటే నాణ్యతలో రాజీ పడడం కాదు, ఈ ఫార్మాట్‌కు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టడం.
ఎందుకింత క్రేజ్
మొదటి ఐదారు సెకండ్లలో హుక్ చేయడం, కొన్ని ఎపిసోడ్ల వరకు ఉచితంగా వీక్షకులకు చూపించడం, కీలకమైన ఎపిసోడ్ దగ్గర కంటెంట్‌ను లాక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోమనడం వల్ల సగటు వీక్షకులు కాస్తా చందాదారులుగా మారుతారు. ఆ రెగ్యులర్ సబ్‌స్క్రైబర్లు చూసే కంటెంట్‌లో ప్రతి ఎపిసోడ్‌లోనూ చివర ఒక షాకింగ్ మూమెంట్ పెట్టడం, లేదా ఎమోషన్‌కు గురి చేయడం వల్ల ఆయా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొవైడర్లు వీక్షకుల ఆసక్తి తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే నచ్చని కంటెంట్‌ను క్షణ కాలంపాటు కూడా వృథా చేసుకోకుండా స్క్రోల్ చేసి వేరే కంటెంట్‌ను చూసే వీలు ఉండడం వల్ల వర్టికల్ డ్రామా సీరిస్‌కి యమ క్రేజ్ ఏర్పడింది.
కొత్త ఆర్థికశక్తిగా...
ఒకప్పుడు రంగస్థలానికి పరిమితమైన వినోద రంగాన్ని సినిమా థియేటర్ పూర్తిగా మార్చేసింది. టెలివిజన్ ఇంటిని మార్చేసింది. లాక్‌డౌన్‌లో పలకరించిన ఓటీటీ ఎంటర్‌టెయిన్‌మెంట్ రూపురేఖలను పూర్తిగా వ్యక్తిగతంగా మార్చేసింది. తాజాగా మైక్రోడ్రామాలు ప్రేక్షకుడి ఖాళీ సమయాన్ని కూడా ఒక మార్కెట్‌లా మార్చేశాయి. ఒకప్పుడు ఐదు నిమిషాలు ఖాళీగా ఉంటే పెద్దగా ఆలోచించేవాళ్లం కాదు. కాని, ఇప్పుడు అదే ఐదు నిమిషాలలోనే ఓ కథను చూస్తున్నాం. అంటే మన ఖాళీ సమయం కూడా ఒక యాప్‌లో ఆదాయం తెస్తున్నాయి. అదే మైక్రోడ్రామాకి ఇంధనంగా మారుతున్నాయి.
1.5 బిలియన్ డాలర్ల మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా మైక్రో డ్రామా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. నిపుణుల అధ్యయనాల ప్రకారం, భారత మార్కెట్ 2026లో సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు స్థాయిలో ఉండగా, 2033 నాటికి అది 6.5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. చైనాలో అయితే 2024లోనే మైక్రో డ్రామా మార్కెట్ 6.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2029 నాటికి చిట్టికథల స్థాయి దాదాపుగా 20 బిలియన్ డాలర్లకు పైనే ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ఇక అమెరికా అయితే 2025లో మైక్రోడ్రామా మార్కెట్ 1.3 బిలియన్ డాలర్లు ఉంటే రానున్న రెండు సంవత్సరాల్లో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇక యూరప్ దేశాలలో మైక్రోడ్రామా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అలాగే లాటిన్ అమెరికా దేశాలలో కూడా వేగంగా విస్తరిస్తోంది. మొత్తంగా చూస్తే, ప్రస్తుతం ప్రపంచ మైక్రోడ్రామా మార్కెట్ విలువ 60 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
భారత్‌లో తొలి మైక్రోడ్రామా యాప్
భారత్‌లో తొలి మైక్రోడ్రామా యాప్ ‘బుల్లెట్’ ఏడాది కిందట మొదలైంది. దీనిని ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్’ భాగస్వామ్యంతో అజీమ్ లలానీ, సౌరభ్ కుష్వా 2025 జూలై 22న ప్రారంభించారు. ‘హర్ మినిట్ మజేదార్’ (ప్రతి నిమిషం ఆనందభరితం) అనే నినాదంతో ప్రచారాన్ని ఊదరగొట్టిన ‘బుల్లెట్’ యాప్– పేరుకు తగ్గట్లే బుల్లెట్‌లాగానే దూసుకుపోతోంది. ప్రారంభంలోనే ఈ యాప్ ఏకంగా 34 మైక్రోడ్రామాలను ఏడు ప్రాంతీయ భాషలలో– హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మలయాళ, మరాఠీలలో అందించి దేశం నలుమూలలకు చెందిన ప్రేక్షకులకు చేరువైంది.
‘బుల్లెట్’ అందించిన ‘రిక్షా రోమియో’, ‘మిన్‌మిని’, ‘బీరువా’, ‘గృహప్రవేశ్’ వంటి మైక్రోడ్రామాలు అత్యధిక వ్యూయర్‌షిప్‌ను రాబట్టాయి. ‘బుల్లెట్’ యాప్ వార్షికాదాయం దాదాపు 500 మిలియన్ డాలర్ల వరకు ఉంటోంది. ‘బుల్లెట్’ ఘనవిజయంతో మన దేశంలో మరిన్ని మైక్రోడ్రామా యాప్స్ కూడా మొదలయ్యాయి. వీటిలో ‘కుకు టీవీ’, ‘స్టోరీ టీవీ’, ‘క్లిప్’, ‘పాకెట్ ఫిల్మ్స్’, ‘క్విక్ టీవీ’, ‘డ్రామా బాక్స్’ వంటివి దాదాపు ఇరవై వరకు ఉన్నాయి. మన దేశంలో మైక్రోడ్రామా యాప్స్ మొదలై కేవలం ఏడాది గడిచింది. ఈ రంగం త్వరలోనే మరింత ఆర్థిక వృద్ధి సాధించగలదని మార్కెట్ వర్గాల అంచనా.
ఉపాధి
మైక్రోడ్రామాలు కేవలం కొత్త వినోద రూపమే కాదు, కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. మైక్రో స్క్రీన్‌ప్లే రచయితలు, వర్టికల్ వీడియో దర్శకులు, ఎడిటర్లు, మొబైల్ సినిమాటోగ్రాఫర్లు, ప్రాంతీయ భాషా డబ్బింగ్ కళాకారులు– ఇలా చాలామంది యువతకు, ఔత్సాహికులకు మైక్రోడ్రామా వారి ప్రతిభను చూపించుకునే ఓ కొత్త ప్లాట్‌ఫాంలా తయారైంది. అలాగే ఒకప్పుడు ప్రకటనలు 30 సెకన్లు ఉండేవి. కాని ఇప్పుడు చిన్నచిన్న నిడివి గల కథల ద్వారా తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. దాని వల్ల ప్రేక్షకుడికి తాను ఓ ప్రకటనని చూస్తున్నాననే భావన లేకుండా, కథాచిత్రాన్ని వీక్షిస్తున్నంత ఆసక్తిగా వీక్షిస్తున్నాడు.
బిజినెస్‌లో ఇదే సెల్లింగ్ పాయింట్. ఇది మాత్రమే కాదు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, బ్రాండ్ ఇంటిగ్రేషన్లు, ఒకే కథను పలు భాషల్లో డబ్బింగ్ చేయించడం వల్ల కోట్లలో ఆదాయం వస్తోంది. తెలుగులో కూడా భావోద్వేగం, కుటుంబ అనుబంధాలు, హాస్యం, థ్రిల్లర్, జానపద కథలు ఇలా– మన దగ్గర కథలకు కొదవే లేదు. కావాల్సిందల్లా వాటిని చెప్పే విధానంలో మార్పు మాత్రమే! ఇదే మైక్రోడ్రామాలకు ఊతమిస్తోంది. దేశవ్యాప్తంగా మైక్రోడ్రామాలు తీసేవారిలో, చూసేవారిలో తెలుగువారు హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు.
వెండితెర నుంచి వేళ్ల తెర
వినోద ప్రపంచ చరిత్రను ఒక వాక్యంలో చెప్పాలంటే ఒకప్పుడు ప్రేక్షకుడు వెండితెర ముందుకు వెళ్లేవాడు. తర్వాత వచ్చిన బుల్లితెర ప్రేక్షకుడి ఇంటికి వచ్చింది. ఇప్పుడు అరచేతిలోకి వచ్చి మునివేళ్లతోటే నచ్చిన కంటెంట్‌ను చూసుకునే వీలు కల్పిస్తోంది టచ్ ఫోన్. దీనిని వేళ్ల తెర అనాలో లేక రీళ్ల తెర అనాలో అనేది ప్రేక్షకుడికే వదిలేయాలి. సరిగ్గా చెప్పాలంటే వినోదం అనే వాకిట్లో మైక్రోడ్రామా అనే రంగుల ముగ్గు అందంగా అమరిపోయింది.
∙శ్రావణ్ జయ


