కష్టాల్లో ఉన్న మనిషికి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓ హగ్ ఇస్తే చాలూ అన్నీ ఇట్టే ఎగిరిపోతాయ్ అని శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు. కానీ ఇక్కడో ఓ కౌగిలి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడికి ఆ ఆలింగనం ఎక్కడా లేని ధైర్యం ఇచ్చింది. అతనితో కన్నీరు పెట్టించింది. హృదయాన్ని తాకే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సైనిక శిక్షణ ముగింపు వేడుకలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తోటి సైనికులు తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటున్న సమయంలో.. ఒంటరిగా నిల్చున్న ఓ యువ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్ అతడికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
In a touching human moment in Indonesia, one soldier stood alone during the closing ceremony of a training exercise, while his colleagues celebrated with their families and loved ones.
His commander noticed the situation from a distance and approached him, embracing him as if he…— The Actual Event (@Gazawins12) August 17, 2026
ఇండోనేషియా ఆర్మీకి చెందిన ఓ రిక్రూట్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఈ భావోద్వేగ ఘటన జరిగింది. ఫస్ట్ TNI AD ఎడ్యుకేషన్ (ఇండోనేషియా ఆర్మీ శిక్షణ వ్యవస్థ) ముగింపు వేడుకలో భాగంగా సైనికులు పట్టాలు అందుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుక సందర్భంగా చాలామంది సైనికులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. కానీ ఓ యువ రిక్రూట్ మాత్రం అందరికీ దూరంగా ఒంటరిగా నిలబడి కనిపించాడు. చుట్టూ ఉన్నవారి ఆనందాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
అక్కడే ఉన్న కమాండర్ ఆ యువ సైనికుడి పరిస్థితిని గమనించాడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి ఎలాంటి మాటలు చెప్పకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనుకోని ఆ ప్రేమాభిమానానికి ఆ రిక్రూట్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కమాండర్‌ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని ఓదారుస్తూ అధికారి కొద్దిసేపు అలాగే ఆలింగనం చేసుకున్నాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడి కార్టోనో అనే వ్యక్తి.. ఆ యువ సైనికుడు తన కుటుంబాన్ని ఎంతో మిస్ అవుతున్నాడని పేర్కొన్నారు. ఇతర సైనికులు తమ కుటుంబాలతో కలిసి వేడుక జరుపుకుంటుండగా.. అతడు ఒంటరిగా నిలబడటం కమాండర్ గమనించారని తెలిపారు. ఆ ఒక్క ఆలింగనం ఆ సైనికుడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కుటుంబ సభ్యుల నుంచి లభించే ప్రేమను గుర్తు చేసిందని పేర్కొన్నారు.
నెట్టింట ప్రశంసలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కమాండర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సైనిక అధికారి కేవలం ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మాత్రమే కాదని.. తన సిబ్బంది భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకుడిగా ఉండాలని పలువురు వ్యాఖ్యానించారు. “అది కేవలం ఓ కౌగిలి కాదు.. ఒంటరిగా ఉన్న సైనికుడికి ఇచ్చిన భరోసా” అంటూ పలువురు స్పందించారు. మరికొందరు ఈ ఘటనలో కమాండర్ మానవత్వాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. కఠినమైన సైనిక శిక్షణ మధ్య కూడా మానవత్వానికి చోటుందని చాటిచెప్పిన ఈ క్షణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంటోంది.
జంతర్ మంతర్ చూమంతర్ కాళీ.. అని శంకర్‌దాదా చెప్పినట్టు ఇది ఏ మంత్రమో కాదు.. కానీ ఓ కౌగిలి చేసిన మ్యాజిక్. కుటుంబానికి దూరంగా ఒంటరిగా నిలిచిన ఓ సైనికుడి బాధను గుర్తించిన కమాండర్.. ఒక్క ఆలింగనంతో అతడికి ధైర్యం ఇచ్చాడు. ఆ హృదయాన్ని తాకే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


