ఖరీదు ఎక్కువైనా ‘ప్రీమియం’ ఉత్పత్తులకు తగ్గని డిమాండ్
డిస్కౌంట్లు, ఈఎంఐలతో అమ్మకాలపై రిటైలర్ల ఆశలు
దీపావళి వరకు సుదీర్ఘ సేల్స్ సీజన్
పండుగ సీజన్ వస్తోందంటే దేశంలో కొనుగోళ్ల సందడి మొదలవుతుంది. అయితే ఈసారి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల (కన్జూమర్ డ్యూరబుల్స్) ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ తరుణంలో ‘వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం కొనసాగుతుందా’ అనేది పరిశ్రమకు అసలు పరీక్షగా మారింది. అయినప్పటికీ డిస్కౌంట్లు, సులభమైన ఈఎంఐ ఫైనాన్సింగ్, ప్రీమియం ఉత్పత్తులపై పెరుగుతున్న ఆసక్తి అమ్మకాలకు ఊతమిస్తాయని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో 8–10 శాతం వృద్ధి నమోదవుతుందని విజయ్ సేల్స్ అంచనా వేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ సేల్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని సంస్థ తెలిపింది. ధరల పెరుగుదల ప్రభావం అన్ని వర్గాల వినియోగదారులపై ఒకేలా ఉండదని క్రోమా స్టోర్లను నిర్వహించే ఇని్ఫనిటీ రిటైల్ తెలిపింది. అధునాతన ఫీచర్లు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికత కలిగిన ప్రీమియం ఉత్పత్తులపై వినియోగదారుల ఆసక్తి బలంగానే ఉందని పేర్కొంది.
ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు
అమెజాన్ ఇండియా జూన్‌లో నిర్వహించిన ‘ప్రైమ్ డే సేల్’లో రూ.35,000కు పైబడిన ప్రీమియం టీవీల అమ్మకాలు గత ఏడాది(2025)తో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా 65 అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ సేల్‌లో అమ్ముడైన ప్రతి అయిదు విండోస్ ల్యాప్‌టాప్‌లలో ఒకటి ఏఐ ఆధారిత పీసీ కావడం విశేషం. రోబోటిక్ వాక్యూమ్‌లు, కాఫీ మెషీన్లు, ఐస్ మేకర్ల వంటి కొత్త తరహా వంటగది ఉత్పత్తుల డిమాండ్ 4.3 రెట్లు పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు, ఎల్రక్టానిక్స్, హోమ్, కిచెన్ విభాగాల్లో కొనుగోళ్లు సాధారణ రోజు కంటే రెండింతలకు పైగా నమోదయ్యాయని అమెజాన్ ఇండియా తెలిపింది. వినియోగదారులు మరింత ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని అమెజాన్ ఇండియా తెలిపింది.
పెరిగిన ధరల సవాల్
స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరగడం ఈ పండుగ సీజన్‌లో పరిశ్రమకు ప్రధాన సవాలుగా మారింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరి నాటికి స్మార్ట్‌ఫోన్ల ధరలు సుమారు 15 శాతం పెరిగాయని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ తెలిపింది. భారత మొబైల్ మార్కెట్‌లో సగటు విక్రయ ధర కూడా 2026 రెండో త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 315 డాలర్లకు(సుమారు రూ.30,000) చేరినట్లు ఐడీసీ పేర్కొంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లోనూ ధరల పెంపు కనిపిస్తోంది. ఏప్రిల్–జూన్ మధ్య ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రెండు దఫాల్లో తన ఉత్పత్తుల ధరలను 16–17 శాతం పెంచగా, బ్లూ స్టార్ 5 శాతం మేర పెంచింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కూడా పలు ఉత్పత్తుల ధరలను పెంచింది.
కొనుగోళ్లపై ప్రభావం ఎంత?
ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకునే అవకాశం లేదు, అయితే ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యస్థాయి, ఎంట్రీ–లెవల్ విభాగాల్లోని, టైర్–2, ఇతర చిన్న పట్టణాల వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద స్క్రీన్ టీవీలు, సైడ్–బై–సైడ్ రిఫ్రిజిరేటర్ల వంటి ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొంతవరకు పండుగ సీజన్‌కు వాయిదా పడ్డాయని సత్య ఏజెన్సీస్ తెలిపింది. అయితే ఎక్సే్చంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఫైనాన్సింగ్ పెరిగిన ధరల భారాన్ని కొంత తగ్గించవచ్చని అంచనా. మరోవైపు, కిచెన్ అప్లయెన్సులు, ఎంట్రీ–లెవల్ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ కొంత స్థిరంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్
సుదీర్ఘమైన పండగ సీజన్‌పై ఆశలు
ఈ ఏడాది దీపావళి నవంబర్‌లో రావడం పరిశ్రమకు మరో అనుకూల అంశంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్‌తో ప్రారంభమయ్యే పండుగ సీజన్ దీపావళి వరకు కొనసాగుతుంది. ఈసారి సెపె్టంబర్ నుంచి నవంబర్ మధ్య వరకు సుదీర్ఘంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్రాండ్లు, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, రిటైలర్లకు ఎక్కువ సమయం లభించనుంది. ‘దీపావళి నవంబర్‌లో వచ్చిన ప్రతిసారీ సేల్స్ విపరీతంగా పెరిగాయి’ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ సంజయ్ చిత్రకారా తెలిపారు. గత ఏడాది ప్రధాన గృహోపకరణాలపై జీఎస్‌టీ తగ్గింపు పరిశ్రమకు కొంత ఊరటనిచ్చింది. అయితే ప్రస్తుతం రాగి, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరల పెరుగుదల తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది.
గత ఏడాదితో పోలిస్తే రాగి ధరలు సుమారు 45 శాతం, అల్యూమినియం ధరలు 25 శాతం పెరిగాయని పరిశ్రమ అంచనా. దీంతో కంపెనీలు ధరల పెంపుతో పాటు కొత్త ఫీచర్లు, ఏఐ ఆధారిత సాంకేతికత కలిగిన ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టి వినియోగదారులను అప్‌గ్రేడ్ కొనుగోళ్ల వైపు మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. మొత్తంగా, పెరిగిన ధరలు పండుగ సీజన్‌లో పరిశ్రమకు సవాలుగా ఉన్నప్పటికీ, ప్రీమియం ఉత్పత్తులపై కొనసాగుతున్న ఆసక్తి, డిస్కౌంట్లు, ఈఎంఐ సదుపాయాలు, సుదీర్ఘ సేల్స్ సీజన్ అమ్మకాలకు ఊతమిస్తాయని పరిశ్రమ ఆశిస్తోంది. సెప్టెంబర్ నుంచి దీపావళి వరకు కొనుగోళ్లు ఎంత మేర పుంజుకుంటాయన్నదే ఈ ఏడాది కన్జూమర్ డ్యూరబుల్స్ రంగం వృద్ధిని నిర్ణయించనుంది.


