ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరి ఆశ శ్రీమంతులు కావడమే. కానీ, అందులో కేవలం 3 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. దీనికి కారణం ప్రతిభో, విద్యా అర్హతో, లభించే అవకాశాలో కాదు.. మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం.. మన ఆలోచనా సరళి! ఈ విషయాన్నే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి. కియోసాకి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది.
‘1970ల కాలంలో మా రిచ్ డాడ్ నాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక చిన్న పాఠం నేర్పారు. జీవితంలో భద్రత, సౌకర్యం, సంపద అనేవి మూడు ముఖ్యమైన ప్రాధాన్యతలు అని చెబుతూ.. వీటిని నన్ను వరుస క్రమంలో అమర్చమన్నారు. సాధారణంగా చాలామంది ఆలోచించకుండా ఎంచుకునే సురక్షితమైన మార్గం
భద్రత-- సౌకర్యం-- సంపద
కానీ నేను ఎంచుకున్న మార్గం వేరు. అదే..
సంపద-- సౌకర్యం-- భద్రత
ఆ ఒక్క నిర్ణయమే నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పేదవారు ఎల్లప్పుడూ ఉద్యోగ భద్రతనే పట్టుకుని వేలాడతారు. మధ్యతరగతి ప్రజలు తాత్కాలిక సౌకర్యాలకే పరిమితమవుతారు. కానీ శ్రీమంతులు మాత్రం భయం అనిపించినా సరే సంపద సృష్టికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది తాము ధనవంతులం కావాలని కోరుకుంటారు. కానీ ఆ ప్రయాణంలో అసౌకర్యం, అనిశ్చితి, అభద్రతాభావం ఎదురైన మరుక్షణమే వెనకడుగు వేస్తారు. ప్రతిసారీ సౌకర్యాన్ని ఎంచుకోవడం వల్లే ఆర్థికంగా ఎదిగేలేక అక్కడే ఉండిపోతారు.
ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. జీవితంలో మీ ప్రాధాన్యత ఏంటి? అనిశ్చితిని, అభద్రతను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా లేకపోతే.. జీవితాంతం ‘నేను ధనవంతుడిని ఎందుకు కాలేకపోయాను?’ అని బాధపడాల్సిందే. మీరు భద్రత, సౌకర్యం, సంపద.. ఈ మూడింటినీ పొందవచ్చు. కాకపోతే, మొదట దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారనేదే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది’ అని రాబర్ట్ రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: గోల్డ్ లోన్లలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం!


