రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం నీటి కోత అమలు! | Drought Crisis Statewide Water Cut Imposed Amid El Nino Alarm | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం నీటి కోత అమలు!

Oct 6 2026 4:52 PM | Updated on Oct 6 2026 4:57 PM

Drought Crisis Statewide Water Cut Imposed Amid El Nino Alarm

నైరుతి రుతుపవనాల ప్రభావం, ఆందోళన కలిగిస్తున్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర తీవ్ర నీటి సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో అక్టోబర్ 16 నుంచి కనీసం 10 శాతం నీటి కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది.

265 తాలూకాల్లో కరవు ఛాయలు

రాష్ట్రంలోని మొత్తం 358 తాలూకాలకు గాను ఏకంగా 265 తాలూకాల్లో (సుమారు 74 శాతం ప్రాంతం, 32 జిల్లాలు) ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే కరవును ప్రకటించింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటడంతో జలవనరుల శాఖ ఆగస్టు 31, 2027 వరకు సరిపోయేలా సుదీర్ఘ నీటి నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసింది.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ.. ఆవిరి కావడం, పూడిక, నీటి అక్రమ తోడకాన్ని పరిగణనలోకి తీసుకుని తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ప్రాజెక్టులో 10 శాతం అత్యవసర బఫర్ స్టాక్‌ను భద్రపరచడంతో పాటు సాంకేతిక పరిశీలన ఆధారంగా డెడ్ స్టోరేజ్ నీటిని కూడా వినియోగించుకోనున్నారు.

కఠిన నిబంధనలు, నీటి తోడకంపై ఉక్కుపాదం

ప్రభుత్వం కేవలం కోతలతో సరిపెట్టకుండా పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

  • పరిశ్రమలు తాము వాడే నీటిలో కనీసం 30 శాతాన్ని రీసైకిల్ లేదా పునర్వినియోగం చేయాల్సిందే. డ్రైనేజీ శుద్ధి ప్లాంట్లను (ఎస్‌టీపీ) పూర్తి సామర్థ్యంతో నడిపి ఆ నీటిని తోటపని, నిర్మాణాలు, వాషింగ్ కార్యకలాపాలకు వాడాలి.

  • తాగునీరు, పశుగ్రాసం అవసరాలు తీరిన తర్వాతే సాగునీటికి విడుదల చేస్తారు. రబీ ఆహార ధాన్యాలు, పశుగ్రాసానికి తొలి ప్రాధాన్యం ఉంటుంది.

  • నదులు, ప్రాజెక్టులు, కాలువల నుంచి అనధికారికంగా నీటిని తోడే వారిపై రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖల సంయుక్త బృందాలు పెట్రోలింగ్ నిర్వహించి మోటార్లను సీజ్ చేస్తాయి.

  • భవిష్యత్తులో ఎల్‌నినో ప్రభావం మరింత సుదీర్ఘంగా మారే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ ప్రణాళికాబద్ధంగా, పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణంపై కొత్త ఆందోళన! ధరలకు రెక్కలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement