స్పెయిన్‌లో ‘ఇంటి పోరు’ | Hundreds of thousands protest Spain housing crisis as strike | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో ‘ఇంటి పోరు’

Oct 4 2026 6:15 AM | Updated on Oct 4 2026 6:15 AM

Hundreds of thousands protest Spain housing crisis as strike

ఇంటి అద్దెలపై పెల్లుబికిన ఆగ్రహం ∙ వీధుల్లో నిరసనల పర్వం

మాడ్రిడ్‌: యూరోపియన్‌ దేశం స్పెయిన్‌లో శనివారం నిరసనలు జోరందుకున్నాయి! రాజధాని మాడ్రిడ్‌ సహా ప్రధాన నగరాలు బార్సిలోనా, వలెంషియాల్లో నినాదాలు హోరెత్తాయి! ఎక్కువ అద్దె కోసం 87 ఏళ్ల మహిళను ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించడం వేలాది మంది ఆగ్రహానికి కారణమైంది. వీధుల్లోకి దిగి ఏళ్లుగా ముదురుతున్న హౌసింగ్‌ సమస్యకు పరిష్కారాలు డిమాండ్‌ చేసింది. 

ఇంటి అద్దెల నియంత్రణకు ప్రభుత్వం శుక్రవారం ఏవో కొన్ని చర్యలు చేపడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇప్పటికైనా మా సమస్యలు తీర్చకపోతే ‘సకల జనుల సమ్మె’కు దిగుతామని ఆందోళనకారులు హెచ్చరించారు! స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో శనివారం సుమారు 70 వేల మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

 బార్సిలోనా, వలెంషియాలతోపాటు దాదాపు 50 నగరాల్లో ఆందోళనలు జరిగినట్లు సమాచారం. వలెంషియాలో ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు పేల్చాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. 

స్పెయిన్‌లో హౌసింగ్‌ సంక్షోభం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతూండటంతో పేదలు, మధ్యతరగతి, వర్గాలకు సొంతిల్లు కలగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మారా డెల్‌ కార్మెన్‌ అనే 87 ఏళ్ల మహిళను మాడ్రిడ్‌లోని అద్దె అపార్ట్‌మెంట్‌ నుంచి బలవంతంగా ఖాళీ చేయించడం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఆమె 70 ఏళ్లుగా అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నప్పటికీ యజమాని అకస్మాత్తుగా అద్దెను విపరీతంగా పెంచేశాడు. 

అంత అద్దె చెల్లించలేనన్న కార్మెన్‌ను కోర్టు ఉత్తర్వుల సాయంతో సెపె్టంబరు 23న బలవంతంగా ఖాళీ చేయించారు. ఈ దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. మాడ్రిడ్‌లోని ప్యూరెటా డెల్‌సోల్‌లో వెయ్యి మంది ఆందోళనకారులు వారం రోజులుగా అక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తూండగా శనివారం దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ ఆందోళనలో భాగమయ్యారు. ఇంటి అద్దెల విషయంలో తగిన చర్యలు తీసుకునేంతవరకూ ఆందోళన కొనసాగుతుందని వీరు చెబుతున్నారు. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కొనుండటం కొసమెరుపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement