స్కూళ్లలో ఫోన్లను నిషేధిస్తే.. ఆశ్చర్యకర ఫలితాలు! | What Happens when Schools Ban Phones | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో ఫోన్లను నిషేధిస్తే.. ఆశ్చర్యకర ఫలితాలు!

Nov 18 2026 12:16 PM | Updated on Nov 18 2026 12:16 PM

What Happens when Schools Ban Phones

మసాచుసెట్స్‌: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం విధిస్తే విద్యార్థుల చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. పాఠశాలల్లో ఫోన్ల వినియోగాన్ని కఠినంగా నియంత్రించిన చోట విద్యార్థుల గణితం, పఠన సామర్థ్యం మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు.

అమెరికాతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల్లో 2010 మధ్యకాలం నుంచి విద్యార్థుల పరీక్షా ఫలితాలు పడిపోతున్నాయి. 2013 నుంచి 2024 మధ్య అమెరికాలో ఎనిమిదో తరగతి విద్యార్థుల గణితం, పఠన సామర్థ్యం సగటున ఒక తరగతి స్థాయి మేర తగ్గింది. ఇదే సమయంలో పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై చేస్తున్న ఖర్చు దాదాపు మూడింట రెండొంతులు పెరిగింది.

ఫోన్‌ వినియోగమే ప్రధాన కారణమా?
తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నప్పుడు విద్యార్థులు సోషల్ మీడియా చూస్తూ సమయం గడపడం చదువుపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హార్వర్డ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ పాలసీ రీసెర్చ్ పరిశోధకులు దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులపై 2021 నుంచి 2025 వరకు అధ్యయనం చేశారు.

ఏం తేలిందంటే?
మొబైల్ ఫోన్లను తాళం వేసే ప్రత్యేక పౌచ్‌లలో భద్రపరచాలని నిబంధన విధించిన పాఠశాలల విద్యార్థుల ఫలితాలను, అలాంటి కఠిన నిబంధనలు లేని పాఠశాలల విద్యార్థులతో పోల్చారు. ఫోన్ నిషేధం ఉన్న పాఠశాలల్లో గణితం, పఠన సామర్థ్యంలో మెరుగైన పురోగతి కనిపించింది.

ఏటా అదనంగా ఒకటి నుంచి రెండు వారాల చదువు!
ఫోన్ నిషేధం వల్ల విద్యార్థులు ఏడాదికి అదనంగా ఒకటి నుంచి రెండు వారాల పాటు నేర్చుకున్నంత పురోగతి సాధించినట్లు అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారికి ముందు విద్యార్థుల ఫలితాల్లో నమోదైన వార్షిక క్షీణతలో ఇది సగానికి సమానమని పరిశోధకులు పేర్కొన్నారు.

ఫోన్ నిషేధమే పరిష్కారం కాదు
దాదాపు అన్ని అమెరికా రాష్ట్రాలు పాఠశాలల్లో మొబైల్ వినియోగంపై కొన్ని పరిమితులు విధించాయి. అయితే తరగతి గదుల్లో ట్యాబ్లెట్లు కూడా విద్యార్థుల దృష్టిని మళ్లించే అవకాశం ఉంది. పాఠశాల సమయం తర్వాత సోషల్ మీడియాలో గడిపే సమయం పెరగడం వల్ల చదవడం, ఇతర విద్యా కార్యకలాపాలకు సమయం తగ్గుతోంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, విద్యా విధానాల్లో మార్పులు  కీలకమని హార్వర్డ్ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement